సచివాలయ సెక్రటరీలు క్రమశిక్షణగా మెలగాలి - కమిషనర్ వికాస్ మర్మత్ ఐ. ఏ.యస్.
నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు విధుల నిర్వహణల్లో క్రమశిక్షణ పాటించాలని కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. స్థానిక 28/1 జెడ్పీ కాలనీ, 28/2 న్యూ మిలటరీ కాలనీ 1, 28/3 న్యూ మిలటరీ కాలనీ 2 వార్డు సచివాలయాలను కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని నోటీసు బోర్డు, హాజరు రిజిస్టర్, వివిధ రికార్డులను పరిశీలించారు. ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంభందించిన ఆస్థి పన్ను ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ అంశాన్ని పన్ను చెల్లింపుదారులకు అవగాహన పెంచాలని సూచించారు.
సచివాలయానికి సంభందించిన వివిధ రకాల రికార్డులను జాగ్రత్తగా పదిలపరచాలని, ఔట్ డోర్ బాధ్యతల వివరాలను మూమెంట్ రిజిస్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కమిషనర్ సూచించారు.
సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, వేసవికాలపు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరం వెలిగేలా పర్యవేక్షించాలని సూచించారు. సచివాలయ కార్యదర్శులు తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ధరించాలని కమిషనర్ ఆదేశించారు.
Post a Comment