శ్రీసిటీని సందర్శించిన శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్
- పారిశ్రామిక ప్రగతిపై ప్రశంస
- శ్రీసిటీ తరహాలో శ్రీలంకలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ఆహ్వానం
రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ, మార్చి 01, 2023:
చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ డి.వెంకటేశ్వరన్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలు, శ్రీలంకతో శ్రీసిటీ వ్యాపార అనుబంధం తదితర అంశాల గురించి వివరించారు.
శ్రీసిటీ మౌళిక సదుపాయాలు, వ్యాపారానుకూల వాతావరణాన్ని వెంకటేశ్వరన్ ప్రశంసించారు. మేక్ ఇన్ ఇండియా తరహాలో మేక్ ఇన్ శ్రీలంక అభివృద్ధికి తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్న ఆయన, శ్రీలంకలో పెట్టుబడి అవకాశాలు, ఇతర ప్రయోజనాలను వివరించారు. ఏండ్ల తరబడి భారత్ తో తమకున్న బలమైన అనుబంధాన్ని ప్రస్తావించిన ఆయన, ఇరుదేశాల వ్యాపార బంధం మరింత పటిష్టం చేయడానికి పరస్పర సహకారం అవసరమన్నారు. శ్రీలంకలో శ్రీసిటీ మోడల్ ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేయాలంటూ శ్రీసిటీ ఎండీ కి ఆహ్వానం పలికారు.
శ్రీసిటీ సందర్శనకు విచ్చేసినందుకు శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపిన రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీ గురించి తెలుసుకోవడానికి శ్రద్ధ చూపడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నాము అన్నారు. ఈ పర్యటన ఫలితంగా ఇరు దేశాల వ్యాపార బంధం మరింత పటిష్టమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ పర్యటనలో భాగంగా శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ బృందం శ్రీసిటీ పరిసరాలను తిలకించడంతో పాటు ఇక్కడ ఏర్పాటైన శ్రీలంక దేశానికి చెందిన ఎవెర్టన్ టీ పరిశ్రమను సందర్శించారు.
Post a Comment