వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం వారి అడుగు జాడల్లో నడవాలి: కలెక్టర్
జ్ఞానం అనేది ఎవరు దొంగిలించ లేనిది:
ఆది కవి వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తి దాయకం: ఎమ్మెల్యే భూమన
తిరుపతి, అక్టోబర్ 09: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం అని ఆది కవి, మహా కవి అని వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి కొనియాడారు.
ఆదివారం ఉదయం కపిల తీర్థం వాల్మీకి రామాలయం మాల్వాడీ గుండం వద్ద వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాల్మీకి జయంతి ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ స్థానిక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డా. శిరీష లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చరిత్రే చెప్తోందని,ఈ రోజు మనం వాల్మీకి జయంతిని ఎందుకు మనం రాష్ట్ర పండుగ గా జరుపుకుంటున్నాము అని చూస్తే మహనీయులు వారి జీవితాన్ని మనం ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి తమ జీవిత లక్ష్యాలను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలి అన్నారు. అందుకే వారిని మనం స్మరించు కుంటున్నమని తెలిపారు. రెండు పక్షులలో ఒకటి మరణించిన సందర్భంలో శోకం నుండి మొట్ట మొదటి శ్లోకం మనకు అందించిన మహర్షి మన వాల్మీకి అని కొనియాడారు. వారు రామాయణంలో దాదాపు ఇరభై నాలుగు వేల శ్లోకాలు రాశారని, తన చుట్టూ పుట్ట పెరిగినా తన దీక్షను, తపస్సును విడువకుండా పూర్తి చేసిన మహానుభావుడు అందుకే వారు వాల్మీకి అయ్యారని తెలిపారు. అందరూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దైనందిన జీవితంలో స్పూర్తితో జీవించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగ గా జరుపుకుంటున్నామని, ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే జ్ఞానం ఎవరో ఒకరి సొత్తు కాదని, కృషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమే అని, అది బోయ వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో నిరూపితమైంది అని అన్నారు. అందరికీ అనుసరణీయం అయిన రామాయణం రచించిన ఆది కవి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నగర పాలక సంస్థ మేయర్ మాట్లాడుతూ వాల్మీకి జయంతి ఇంత ఘనంగా మనం జరుపుకోవడం ఎంతో సంతోషించ దగిన విషయం అని తెలిపారు.
సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార అధికారి యుగంధర్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, కార్పొరేటర్ సిద్ధా రెడ్డి, వాల్మీకి సంఘ నాయకులు, భాను ప్రకాష్ రెడ్డి, తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Post a Comment