రవి కిరణాలు న్యూస్ శ్రీసిటీ: తిరుపతి విమానాశ్రయం డైరెక్టర్ ఎం.రాజకిషోర్ శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇతర అధికారులతో చర్చించిన ఆయన, విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలు, సేవలను వివరించారు. తిరుపతి విమానాశ్రయంలో మరిన్ని సేవలను పెంచాల్సిన ఆవశ్యకత, డిమాండ్ దృష్ట్యా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు. శ్రీసిటీ పరిశ్రమవర్గాలు తమ ప్రయాణ అవసరాలు, కార్గో బుకింగ్‌లకు ఎయిర్‌పోర్ట్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. చిన్న, భారీ వస్తువులను వివిధ గమ్యస్థానాలకు త్వరితగతిలో రవాణా చేయడానికి కార్గో టెర్మినల్ వీలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. శ్రీసిటీ, విమానాశ్రయం మధ్య రోడ్డు కనెక్టివిటీ మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రయాణ అవసరాలకు కూడా తిరుపతి విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని రాజకిషోర్ కోరారు.
శ్రీసిటీని సందర్శించినందుకు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏపిఐఐసి తిరుపతి జోనల్ మేనేజర్ ఎస్ఎస్ సోనీ తదితరులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా సిద్దార్థ లాజిస్టిక్స్ కంపెనీని రాజకిషోర్ సందర్శించి, అక్కడ అధికారులతో చర్చించారు.
Post a Comment