శ్రీసిటీని సందర్శించిన విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ - CSR కార్యక్రమాలు, విస్తృత ఉద్యోగ అవకాశాల పట్ల సంతృప్తి
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎం.సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి మరో ముగ్గురు అధ్యాపకులతో కలిసి శుక్రవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి, ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే విధంగా శ్రీసిటీ ఎలాంటి ప్రభావశీల పాత్ర పోషించిందనే దానిపై పవర్పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.
శ్రీసిటీ ప్రస్థానం, వేగవంతమైన మార్పుల గురించి వివరిస్తూ, శ్రీసిటీలో ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి జీవనోపాధిని కల్పించామని, వారిలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి, తాము చురుకైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఇది తమ అతిపెద్ద విజయాలలో ఒకటి అని తెలుపడానికి గర్వపడుతున్నాము అన్నారు.
ఈ ప్రాంతంలోని విద్య, ఉపాధి, సామాజిక ఆర్థిక అభివృద్ధిలో శ్రీసిటీ ప్రభావం ఎక్కువగా వుందని ఆయన చెప్పారు. తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం ద్వారా నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, సామాజిక మౌళిక సదుపాయాలు, జీవనోపాధి ఎంపికలు మొదలైనవి మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
తమ సందర్శనకు ఆహ్వానం చెప్పినందుకు శ్రీసిటీ ఎండీకి ప్రొఫెసర్ సుందరవల్లి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ CSR కార్యకలాపాలతో ఈ ప్రాంతవాసులకు ముఖ్యంగా మహిళలకు సమృద్ధిగా ఉద్యోగాలు కల్పించడం పట్ల ఆమె శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు.
పారిశ్రమికవాడ ప్రగతి, CSR కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం యూనివర్సిటీ అధికారుల సందర్శన ఉద్దేశ్యం కాగా, పై అంశాలపై వారు నిశితంగా దృష్టి సారించారు. అలాగే యూనివర్సిటీలో ప్రవేశపెడుతున్న ఫుడ్ టెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీ మొదలైన కొత్త కోర్సుల వివరాలను తెలియచేసి, దీనికి సంబంధించి పరిశ్రమవర్గాల నుంచి తగు సహకారం కోరారు. ఇంకా ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, పరిశ్రమ ఇంటర్న్‌షిప్‌లు మొదలైన వాటితో సహా అనేక విషయాల గురించి శ్రీసిటీ అధికారులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అన్ని విధాలా తగిన సహకారం అందిస్తామంటూ ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ హామీ ఇచ్చారు. చర్చల అనంతరం వీసీ బృందం శ్రీసిటీ పరిసరాలు చుట్టిచూడడంతో పాటు ఎవర్టన్ టీ పరిశ్రమను సందర్శించారు.
Post a Comment