రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి..భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు




వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కార్యాలయంపై స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలు దాడులు చేశారు.కేరళలోని అటవీ ప్రాంతాల్లో ఏకో సెన్సెటివ్‌ జోన్‌ ఏర్పాటు విషయంలో స్పందించట్లేదని ఆరోపిస్తూ కార్యాలయంలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడిని చేయించింది కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగం కార్యకర్తలే అని ఆరోపించారు. వారిని కావాలనే రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని చెప్పారు. దాడికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత, కేరళ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ''వయనాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇది చట్టవ్యతిరేకమైన చర్య, ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా'' అని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దాదాపు 100 మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

దాడిని ఖండించిన కేరళ సీఎం

రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడి ఘటనపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ''రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయవచ్చు. కానీ, ఈ ఘటన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది. ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని ఆయన తెలిపారు.

ఎకో-సెన్సిటివ్ జోన్‌ ఏంటీ?

దేశంలోని అన్ని రక్షిత అటవీప్రాంతాల చుట్టూ కనీసం ఒక కిలోమీటరు మేర భూభాగం ఎకో - సెన్సిటివ్‌ జోన్‌గా ఉండాలని ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కిలోమీటరు ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్‌ పార్కుల్లో ఎలాంటి మైనింగ్‌ కార్యక్రమాలు చేపట్టకూడదని, ఇందుకు అనుమతులే ఇవ్వకూడదని తెలిపింది. ఒకవేళ ఇప్పటికే ఎక్కడైనా ఎకో - సెన్సిటివ్‌ జోన్‌గా కిలోమీటరుకు మించి ప్రకటించి ఉన్నా, ఏదైనా చట్టబద్ధమైన సంస్థ కిలోమీటరుకు మించిన ప్రాంతాన్ని ఎకో - సెన్సిటివ్‌ జోన్‌గా గుర్తించి ఉన్నా ఆ సరిహద్దే చెల్లుబాటవుతుందని పేర్కొంది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget