శ్రీసిటీని సందర్శించిన ఢిల్లీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు
- శ్రీసిటీ ప్రత్యేకతలపై అధ్యయనం
- దేశంలోనే ఉత్తమ మోడల్ గా ప్రశంస
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (GNCTD) పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమీషనర్ శ్రీమతి నిహారిక రాయ్, IAS, ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (DSIIDC) మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మిట్టల్, IAS, మరో ఇద్దరు అధికారులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ వారికి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, ప్రగతి, ప్రత్యేకతలు, వాణిజ్య అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు 'సులభతర వ్యాపారం'కి దోహదపడే అంశాల గురించి ఆయన వారికి వివరించారు.
శ్రీసిటీ అభివృద్ధి ప్రారంభ దశలలో ఎదుర్కొన్న కొన్ని సవాళ్లు, వాటి పరిష్కారాల మార్గాల గురించి వివరించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఏదైనా భారీ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడంలో తమ ఆలోచనలను అందించడానికి తాము సంతోషిస్తామన్నారు. ఈ సందర్శన గురించి వ్యాఖ్యానిస్తూ, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు తమ ప్రాజెక్ట్ అమలు మోడల్‌ను ప్రస్తావించడం, అధ్యయనం చేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
భారీ ఇండస్ట్రియల్ పార్క్‌ని రూపొందించడంలో శ్రీసిటీ యాజమాన్య కృషిని నిహారిక రాయ్ అభినందించారు. శ్రీసిటీలోని అత్యున్నత సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే ఒక ముఖ్యమైన పారిశ్రామిక మౌళిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీసిటీ చక్కటి ఉదాహరణగా ఆమె ప్రశంసించారు.
కాగా, శ్రీసిటీ ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించడం మరియు శ్రీసిటీ సెజ్ లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అభివృద్ధిని పరిశోధించడం ఢిల్లీ అధికారుల పర్యటన ఉద్దేశం. శ్రీసిటీ ఎండీ, ఇతర అధికారులతో సమావేశమైన వీరు, వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు భారత్ ఎఫ్ఐహెచ్ (ఫాక్స్‌కాన్), CETC పరిశ్రమలను సందర్శించారు.
Post a Comment