ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. నాడు–నేడు, ఇంగ్లీషు మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేష్‌కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్‌పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో ‘బైజూస్’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ అమెరికా నుంచి పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా వివిధ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్కడే బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌తో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ–లెర్నింగ్ కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్ చెప్పారు.
ఈ చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇప్పటివరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విద్య ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డం కాకూడదనే సంకల్పంతో వైఎస్ .జగన్ సర్కార్ ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయకుమార్ రెడ్డి, ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుస్మిత్ సర్కార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Post a Comment