రోటరీ క్లబ్, వర్త్ ట్రస్ట్ ద్వారా దివ్యాంగుల సాంకేతిక శిక్షణా కేంద్రం ప్రారంభం
రోటరీ క్లబ్, వర్త్ ట్రస్ట్ ద్వారా దివ్యాంగుల సాంకేతిక శిక్షణా కేంద్రం ప్రారంభం - లాంఛనంగా ప్రారంభించిన శ్రీసిటీ ఎండీ
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) : రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ (RCM) మరియు వర్త్ ట్రస్ట్ సంస్థలు సంయుక్తంగా శ్రీసిటీ సమీపంలోని గుమ్మిడిపూండి RCM బాయ్స్ టౌన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని బుధవారం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రారంభించారు. గుమ్మిడిపూండి RCM అధ్యక్షుడు పీవీ మోహన్ రామన్, రోటరీ జిల్లా గవర్నర్ జె.శ్రీధర్, రంజిత్ ప్రతాప్, ప్రాజెక్టు చైర్మన్ రవి సుందరేశన్, ఇతర పలువురు రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దివ్యాంగులైన బాలురకు వివిధ వృత్తివిద్యా కోర్సులలో సర్టిఫికేట్ శిక్షణ అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిన RCM మరియు వర్త్ ట్రస్ట్ సంస్థలను ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు. దీనికి తన పూర్తి మద్దతు, సహకారం అందించడంతో పాటు, కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన యువకులకు శ్రీసిటీలోని పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్య అతిథి, ఇతర సభ్యులకు సాదర స్వాగతం పలికిన మోహన్ రామన్ మాట్లాడూతూ, ఈ ప్రాజెక్ట్ ఫలప్రదం కావడానికి గత 4 నుండి 5 సంవత్సరాల కాలంలో చేసిన పనిని క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్‌లు, ఆర్‌సీఎం మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ తమ అనుభవాలను, ఆనందాన్ని పంచుకున్నారు.
గుమ్మిడిపుండి ప్రాంతంలో 5.5 కోట్ల పెట్టుబడితో 2.55 ఎకరాల స్థలంలో 4500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సాంకేతిక శిక్షణా కేంద్రం భవనంలో అన్ని అవసరమైన యంత్రాలు, ఉపకరణాలు, ఇతర మౌళిక సదుపాయాలతో పాటు విద్యార్థుల బస కోసం పది రెసిడెన్షియల్ యూనిట్లును నిర్మించారు. ఈ కేంద్రంలో రెండు సంవత్సరాల టర్నర్ మరియు మెషినిస్ట్ రెసిడెన్షియల్ కోర్సు, ఒక సంవత్సరం కుట్టు కట్టింగ్ టెక్నాలజీ కోర్సు, ఆరు నెలల స్మార్ట్ ఫోన్ సర్వీస్ కోర్సును అందిస్తుంది. న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ట్రైనింగ్ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా అన్ని కోర్సులు ధృవీకరించబడతాయి.
కాగా, రోటరీ ఇంటర్నేషనల్ కింద పనిచేస్తున్న RCM కు 93 సంవత్సరాల విశిష్ట సామాజిక సేవ చరిత్ర ఉంది. ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య, నైపుణ్యాభివృద్ధి, విపత్తు నిర్వహణ, స్థిరమైన పర్యావరణం వంటి విభిన్నమైన సమాజ అవసరాలను తీర్చే ప్రాజెక్ట్‌లకు చొరవ చూపుతున్న RCM, సామాజిక కార్యక్రమాల్లో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రముఖ సంస్థ వర్త్ ట్రస్ట్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. వినికిడి లోపం, శారీరక వైకల్యంతో భాదపడుతున్న దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడం, ఉద్యోగం కల్పించడం ద్వారా వారికి జీవనోపాధి కల్పించడమే నూతన సాంకేతిక శిక్షణా కేంద్రం ప్రధాన లక్ష్యం.
Post a Comment