క్యాంప్‌ కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

క్యాంప్‌ కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

పాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 కొత్త జిల్లాలను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌. 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో నేటి నుంచి పునర్‌వ్యవస్ధీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌.

మనది 26 జిల్లాల ఆంధ్రరాష్ట్రం…
ఈ రోజు నిజంగా శుభదినం. ఆంధ్రరాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని ఈ రోజు నుంచి మనమంతా గ్రామస్ధాయి నుంచి చూశాం. జిల్లా స్ధాయిలో కూడా ఆ వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇవాళ ప్రారంభమవుతుంది. ఈ రోజునుంచి మనది 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారుతుంది.

13 కొత్త జిల్లాల ప్రజలకు శుభాకాంక్షలు…
ఈసందర్భంగా కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, కొత్త కార్యాలయాలు ద్వారా సేవలందించేందుకు కొత్త జిల్లాలకు చేరుకుని పనులు ప్రారంభిస్తున్న అధికారులకు, కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉద్యోగులు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇవే కొత్త జిల్లాలు… పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు. ఇవి మనం కొత్తగా ఏర్పాటు చేసినవి. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం ఈ రెండింటితో పాటు స్వాతంత్య్ర సమరాన్ని, నా గిరిజన అక్కచెల్లెమ్మలు,అన్నదమ్ముల సెంటిమెంట్‌ను, సేవాభావంలో ఆకాశమంత ఎదిగిన మహావాగ్గేయ కారులను, ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల ఏర్పాటు వాటి పేర్లు నిర్ణయించాం.

గత జిల్లాల పేర్లు అలాగా ఉన్నాయి…గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవరం ఇవి గత జిల్లాలకు ముఖ్యపట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకుంటూ.. కనీసం ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తంగా 26 జిల్లాలు ఈ రోజు నుంచి కొలువుదీరుతున్నాయి.

1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడితే, 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి. ఈ రెండే గత 70 యేళ్ల చరిత్రలో మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త జిల్లాలు. ఫలితంగా పరిపాలనా సంస్కరణలు, వికేంద్రీకరణ విషయంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగానే మనం మిగిలిపోయాం.

జిల్లాల ఏర్పాటు – మౌలిక అంశాలు
దేశంలోని వివిధ రాష్ట్రాలలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొన్ని మౌలిక అంశాలను మీ ముందు ఉంచుతున్నాను.

28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఒక దేశ రాజధాని ప్రాంతంగా ఉన్న మన భారతదేశంలో… మొత్తం 727 జిల్లాలు ఉన్నాయి. యూపీలో అత్యధికంగా 75 జిల్లాలు అయితే అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 727 జిల్లాల్లో, దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో మాత్రం నిన్నటివరకు 13 జిల్లాలతోనే ఉన్నాం. అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో చూస్తే.. 1.38 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో కూడా ఏకంగా 25 జిల్లాలు ఉన్నాయి.

ఇక్కడ మరో విషయం గమనించినట్లైతే… 2011లో చివరి జనాభా లెక్కల ప్రకారం ఒక్కో రాష్ట్రంలో జిల్లాకు సగటున ఎంత జనాభా ఉన్నారన్నది ఒక్కసారి చూస్తే.. మనకు నిన్నటి వరకు సగటున అంటే 13 జిల్లాలలో 4 కోట్ల 90 లక్షలు ప్రకారం వేసుకుంటే… 38 లక్షల 15 వేల మంది జిల్లాల సగటు జనాభా. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదు.

మిగిలిన రాష్ట్రాలతో ఈ సగటును పోల్చి చూస్తే… మహారాష్ట్రలో సగటున ఒక్కో జిల్లాలో 31 లక్షలు మంది ఉంటే, మన పక్కన ఉన్న తెలంగాణాలో 10 లక్షల 60 వేల మంది సగటున జిల్లాకు ఉన్నారు. కారణం అక్కడ కొత్తగా 33 జిల్లాలు చేశారు. ఉత్తరాఖండ్‌లో కేవలం 6 లక్షలు మందికి… మిజోరంలో లక్షమందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53వేల మందికి ఒక జిల్లా ఏర్పాటు చేశారు.
మన పొరుగున ఉన్న కర్ణాటకలో 20 లక్షలు, యూపీలో 26.64 లక్షల మందితో ఒక జిల్లాగా ఏర్పడ్డాయి.

సగటున 19.7 లక్షల జనాభాతో కొత్త జిల్లా… ఈ రోజు నుంచి మనం 13 నుంచి 26 జిల్లాలు చేయడంతో ఇంతకముందు 38.15 లక్షల మందితో జిల్లాగా ఉన్న పరిస్థితి మారి… ఇప్పుడు 19 లక్షల 7వేల మందితో సగటున జిల్లా కింద ఏర్పడి రూపురేఖలు మారుతున్నాయి. ఒక్క గిరిజన జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు 6 నుంచి 8 అసెంబ్లీ స్ధానాలతో ఒక జిల్లా రూపొందించడం జరిగింది. 18 నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా పునర్‌వ్యవస్ధీకరణ చేశాము.

జిల్లాల ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో.. మరింత అర్ధమయ్యేలా వివరంగా చెప్పాల్సి వస్తే…
మన దేశంలో జనాభా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారుగా 100 కోట్లు పెరిగింది. నాడు జనాభా దాదాపుగా 35 కోట్లు అయితే ఈ రోజు జనాభా 138 కోట్లు అని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఆ రోజు కలెక్టర్లుకు ఉన్నది అజమాయిషీ, అధికారం అయితే.. ఈ రోజు కలెక్టర్లకు అధికారంతో పాటు మన ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉన్నరోజులివి.

మారుతున్న ప్రపంచంతో పాటు … మారుతున్న ప్రపంచంతో పాటు ప్రజలందరికీ అందించే సేవలలో … ప్రభుత్వ పాత్రను కూడా.. ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు మనం మార్పు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

బ్రిటీషర్ల హయాంలో ఒక్కసారి గమనించినట్లైతే… జిల్లా కలెక్టర్లు అంటే అర్ధం జిల్లా రెవెన్యూ కలెక్ట్‌ చేసే వారు కింద మాత్రమే ఉండే రోజులవి. ఇప్పుడు రెవెన్యూ వసూలు అన్నది వారి విధులలో ఒక్కటి మాత్రమే. వారు మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని సక్రమంగా అమలు చేసే ప్రతినిధులుగా మనం ఈ రోజు గమనిస్తూ ఉన్నాం. కలెక్టర్లు పాత్ర ఏమిటంటే జిల్లా వ్యాప్తంగా సమన్వయం చేస్తూ.. జిల్లా మొత్తం పర్యవేక్షించే బాధ్యత ఈరోజు కలెక్టర్ల భుజస్కందాలపైనే ఉంది.

జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో…. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే గతంలో కేవలం రెవెన్యూ మాత్రమే ఉండేది. కాస్తా కూస్తో లా అండ్‌ ఆర్డర్‌ కూడా వారి పరిధిలో ఉండే గత రోజుల నుంచి చూస్తే.. నేడు జిల్లా కలెక్టర్లు పరిధిలో లా అండ్‌ ఆర్డర్, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సోషల్‌ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన, ప్రాధమిక విద్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్, సివిల్‌ సఫ్లైస్, కార్మిక చట్టాలు, విపత్తు నిర్వహణ, పంపిణీ విభాగం, ఎన్నికల నిర్వహణ కూడా కలెక్టర్లు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సేవలు, పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే ఈ సంస్కరణలు అన్నీ చేపట్టడం జరిగింది. గ్రామస్దాయి నుంచి కూడా మార్పులు తీసుకొచ్చాం. మనందరి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు మీ అందరి కళ్లెదురుగా ఈరోజు కనిపిస్తున్నాయి.

గడప, గడపకూ చేరిన పరిపాలన… ప్రతిఒక్క గ్రామంలోనూ, ప్రతి ఒక్క వార్డులోనూ ఇంకా చెప్పాలంటే ఇంటింటికీ, గడప, గడపకూ చేరే పరిపాలన ఈ రోజు మనమంతా చూస్తున్నాం. ఈ మూడేళ్లలో పౌరసేవలు ఎలా పెరిగాయో.. వాటిని అందించడంలో ఏ రకమైన మార్పులు చోటు చేసుకున్నాయో మనమంతా గమనిస్తే..ఈ రోజు గ్రామస్ధాయి నుంచి పౌరసేవల్లో వేగం పెరిగింది. పారదర్శకత పెరిగింది. అవినీతి, వివక్ష వంటి వాటిని పూర్తిగా రూపుమాపిన పరిస్థితిలోకి వ్యవస్ధలు తయారయ్యాయి. సంతృప్తి స్ధాయిలో ప్రతి అవకాశం, ప్రతి పథకం ఈ రోజు అమలుతున్నాయి.

మెరుగైన వైద్య సేవలు….రాష్ట్రంలో ఇవాళ గమనిస్తే వైద్య సేవలు చాలా, చాలా మెరుగైన పరిస్థితిలోకి పరుగెత్తుతున్నాయి. దాదాపుగా 1100 వాహనాలు 108, 104లు కళ్లెదుటనే కనిపిస్తున్నాయి. ఎవరికి బాగాలేకపోయిన 20 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే వారి ముందుకు వచ్చి, వారికి మెరుగైన సేవలు అందించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

అక్క, చెల్లెమ్మల భద్రతలోనూ… అక్కచెల్లెమ్మల భద్రత విషయంలో ఎప్పుడూ, ఎక్కడా కూడా జరగని విధంగా.. దాదాపుగా 1 కోటి 19 లక్షల దిశా యాప్‌ డౌన్లోడ్స్‌ కూడా అక్కచెల్లెమ్మల ఫోన్లలో అందుబాటులో ఉంది. ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా… లేదా వారు ఏదైనా ఆపదలో ఉండి ఒక ఐదుసార్లు గట్టిగా ఫోన్‌ షేక్‌ చేసినా కేవలం 10 నిమిషాల నుంచి 20 నిమిషాలలోపే ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు పోలీసు సోదరులు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న మార్పులు గమనిస్తే.. రేషన్‌ ఇంటికి తీసుకొచ్చి డోర్‌ డెలివరీ చేస్తున్న ప్రప్రధమ ప్రభుత్వం మనదే. మనదగ్గర ప్రారంభమైన దాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకుని… మనం ఎలా చేస్తున్నామో తెలుసుకుని.. మనల్ని అనుసరిస్తున్నాయి.

మన గ్రామ, వార్డు సచివాలాయాలను చూస్తే.. బర్త్‌ సర్టిఫికేట్‌ దగ్గర నుంచి రేషన్‌ కార్డు, కులధృవీకరణ పత్రం, పెన్షన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇలా ఏదైనా కూడా ఇన్ని రోజుల్లో ఇవ్వాలని గడువు పెట్టి మరీ ప్రజలకు అందించే గొప్ప వ్యవస్ధ మన కళ్లెదుటే కనిపిస్తుంది.
ఒకటో తేదీన నిద్రలేవకముందే, సూర్యోదయాన్నే గుడ్‌ మార్నింగ్‌ అని పలకరించి… అది సెలవు రోజైనా ఒకతో తేదీ వచ్చేసరికి మన ఇంటి ఎదుటకు వచ్చి వాలంటీర్లు సామాజిక ఫించన్లు డోర్‌ డెలివరీ చేస్తున్న గొప్ప మార్పు మన కళ్లెదుటనే కనిపిస్తోంది.
వికేంద్రీకరణ గురించి చెప్పాల్సి వస్తే… ప్రతి 2వేల మందికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ వ్యవస్ధ, ఏకంగా 15,004 సచివాలయాల ద్వారా విజయవంతంగా సేవలందిస్తున్న తొలి ప్రభుత్వం మనదే అని సగర్వంగా చెప్పాలి.

రైతు భరోసా కేంద్రాలు… రైతు భరోసా కేంద్రాలనే తీసుకుంటే గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌ గ్రామాల్లో ఎక్కడా కనిపించేది కాదు. మన ప్రభుత్వంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఇవాళ ఏర్పాటయ్యాయి. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతన్నకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడే గొప్ప వ్యవస్ధ రూపుదిద్దుకుంది.

పరిపాలనలో మౌలిక మార్పులకు, సంస్కరణలు… ప్రభుత్వ స్కూళ్లు చూసినా, ప్రభుత్వ ఆసుపత్రలు చూసినా గణనీయంగా రూపురేఖలు పూర్తిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో సేవలను కూడా పూర్తిగా మార్చివేసిన నేపధ్యం. పరిపాలనా విధానంలో మన ప్రభుత్వం ఒక ఫిలాసిఫికల్‌ మార్పును తీసుకువచ్చింది.

వైద్య భోధనా కళాశాలలు చూస్తే… స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనకు ప్రభుత్వ రంగంలో 11 మెడికల్‌ టీచింగ్‌ ఆసుపత్రులు ఉంటే.. ఈ రోజు మరో 16 యుద్ధప్రాతిపదికన కట్టే గొప్ప ఆలోచనతో ఈ రోజు అడుగులు ముందుకు పడుతున్నాయి.

సాచ్యురేషన్‌ ప్రాతిపదికన లంచాలకు, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలన్నీ అర్హులందరికీ డీబీటీ ప్రాతిపదికన అందిస్తుండటం చారిత్రాత్మకంగా ఒక గొప్ప మార్పు అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇదంతా మన ప్రభుత్వంలోనే జరుగుతుంది. పరిపాలనలో మౌలిక మార్పులకు, సంస్కరణలు ఇవన్నీ ఉదాహరణలు.

ఎన్నికల మేనిఫెస్టోలో…. గ్రామస్ధాయి నుంచి వార్డు స్ధాయిలో వచ్చిన మార్పులతో పాటు జిల్లా పరిపాలనకు సంబంధించి కూడా మార్పులు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన మార్పులు కూడా అంతే అవసరం. ఎందుకంటే గ్రామస్ధాయి నుంచి జరిగిన మార్పులకు రెవెన్యూ, జిల్లా స్ధాయిలో మార్పులు ఒక్కటై చేయిపట్టుకుని నడవగలిగితేనే ఈ మార్పులు పదికాలాలపాటు ఉండగలుగుతాయి. అందుకే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు చేసే గొప్ప కార్యక్రమాన్ని ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చేర్చాం.

అంతే కాకుండా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కూడా ప్రతి జిల్లాలో గమనించడం జరిగింది. జిలాల్లో ముఖ్యపట్టణానికి, జిల్లాలో చివరి ఉన్న ప్రాంతం ఎంత దూరంలో ఉందో… మనందరికీ తెలుసు. అటువంటి తేడాలు, దూరాన్ని కూడా పూర్తిగా మటుమాయం చేయాలన్న గొప్ప ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం.

కనీసం 15 ఎకరాల్లో అన్ని కార్యాలయాలు…. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, మిగిలిన కేంద్రాలు అన్ని ఒకేచోటకి వస్తాయి. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే… అన్ని కార్యాలయాలు ఒకే చోట కనిపిస్తాయి. వీటికోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేచోట ఉండేలా గొప్ప వ్యవస్ధను తీసుకొస్తున్నాం.

మరో విషయం కూడా తెలియజేయాలి..* రాష్ట్ర వ్యాప్తంగా స్ధానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాల్లో కూడా మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. తొలుత నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇందులో కూడా 12 నియోజకవర్గాల్లో మండలాలను కొద్దిగా విభజించి కొన్ని మండలాలను ఒక జిల్లాలోనూ, కొన్ని మండలాలను మరొక జిల్లాల్లోనూ ప్రజల ఆకాంక్షల మేరకు చేయాల్సి వచ్చింది.

కుప్పం స్ధానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు… అదే విధంగా కుప్పం స్ధానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, అప్పడు రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేసుకోలేక పోగా..ఇప్పుడు ఆయనే.. ఆక్కడే రెవెన్యూ డివిజన్‌ కావాలని విజ్ఞప్తి చేసిన మేరకు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా ఒక రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం.

గ్రామం నుంచి రాజధానుల వరకూ అదే మా విధానం
ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలతో పాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. పరిపాలనకు సంబంధించి డీసెంట్రలైజేషన్‌ అన్నది …. ప్రజలకు మంచి చేసేది కాబట్టి, అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తూ… కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతిభద్రతలు, పారదర్శకత లభించాలని మనసారా కోరుతున్నాను.

దేవుడి దయ ప్రజలందరిపైనా ఉండాలని, మంచి కార్యక్రమానికి దేవుడి ఆశీస్సులు గొప్పగా, బలంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

అనంతరం క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వర్చువల్‌గా కొత్త జిల్లాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రవాణా, ఐ అండ్‌ పీఆర్‌ శాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వ సలహాదారు( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, వ్యవసాయశాఖస్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్‌ అండ్‌ బి ముఖ్యకార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, ప్లానింగ్‌ సెక్రటరీ విజయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget