ఏపీ పరిణామాలపై ప్రధాని మోదీకి నివేదిక ఇచ్చిన గవర్నర్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిణామాలపై గవర్నర్ ఒక నివేదిక ఇచ్చారు.రాష్ట్రంలో పరిణామాలపై చర్చించారు. సుమారు 40 నిముషాలపాటు ఈ భేటీ జరిగింది. కేవలం మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. కానీ ఏపీలో ఉన్నటువంటి తాజా పరిస్థితులపై చర్చలు జరిపి, నివేదిక ఇచ్చారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.. దానికి కారణాలు.. అక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వాటి కోసం ఏ విధంగా అప్పులు చేస్తున్నది, అభివృద్ధి ఏ మేరకు ఉందన్నదానిపై చర్చలు జరిపినట్లు సమాచారం.
అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలుస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా నరేంద్ర మోదీ, అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒక నివేదిక అందజేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
Post a Comment