కెనడా నించి అంతర్జాలంలో తెలుగు భాషకి అత్యున్నత వైభవం సప్త ఖండ అవధానం"- రికార్డుల వెల్లువ
తెలుగు భాషకే చెందిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో "సప్త ఖంఢ అవధాన సాహితీ ఝరి" అనే కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు మూడు భాషలలో సహస్ర అవధానం చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు.
ప్రతి మాసం ఒక్కొక్క ఖండం చొప్పున దాదాపు 20కి పైగా దేశాలు పాల్గొనగా, అంతర్జాలం లో 11 అష్టావధానాలు పూర్తి చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, కెనెడా దేశం నుండి 8 మంది వనితలు పాల్గొన్న 12వ అష్టావధానం పూర్తి చేసారు. ఈ అవధానం లో దక్షిణ అమెరికా కి చెందిన పెరూ దేశం నుండి శ్రీ శ్రీనివాస్ పోలవరపు గారు కూడా పాల్గొన్నారు.
ఈ అవధానంలో శ్రీ కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతులు, జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు విచ్చేసి తమ అమూల్య అశీర్వాదాలు అనుగ్రహించారు.
ఎంతో రసవత్తరంగా, కన్నుల పండుగగా సాగిన ఈ అవధానాన్ని సాహితీ ప్రియులు, సాహిత్యాభిమానులూ తిలకించి, ఇటువంటి సభలే తెలుగు భాషను కలకాలం వెలిగింపజేసేవని హర్షం వ్యక్తపరిచారు.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘శ్రీ ప్రణవ పీఠం’స్థాపించారు. ప్రవచన కర్తగా వారు సుప్రసిద్ధులు. సంగీత, సాహిత్యాలలో సమప్రతిభ, తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో సమ పాండిత్యం కలిగిన వారు. తెలుగు భాషని, సాంస్కృతినీ నిలబెట్టడానికి వీరు ఆధ్యాత్మిక యాత్రలని చేస్తుంటారు.
ఏడు ఖండాల్లో జరిగిని ఈ 12 అవధానాలతో కలుపుకుని ఇప్పటికి 1242 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు, తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేసారు వద్దిపర్తి వారు.
ఈ అసాధారణమైన ప్రతిభని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు గుర్తించాయి.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు శ్రీ బింగి నరేంద్ర గౌడ్ గారు; జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు, డాక్టర్ ఎం.విజయలక్ష్మి మురుసుపల్లి గారు; తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుండి చీఫ్ అడ్వైజర్ డా. సాయి శ్రీ గారు, ఏలూరు జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ డా. శివశంకర్ గారు మొదలైన ప్రతినిధులు నేరుగా శ్రీ ప్రణవపీఠానికి విచ్చేసి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి సర్టిఫికెట్, మెడల్ అందజేసి సత్కరించారు.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంకల్ప ఝరి ఉవ్వెత్తున సాగాలని , వారి గళం మరిన్ని ప్రణవ నాదాలు పలకాలని, తెలుగుభాష మరింత ఖ్యాతిని గడించాలని ఆశిద్దాం.
Post a Comment