సభలో నాగరికత తో ప్రవర్తించండి : ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
*సభలో వరుసగా రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ నినాదాలు చేయడంతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. టీడీపీ సభ్యులకు మీ ద్వారా వినమ్రంగా కూడా విన్నవిస్తున్నాను. దయచేసి నాగరికతతో (సివిలైజ్డ్‌గా) ప్రవర్తించండి. సభను జరిపించకూడదు అన్న ఆలోచన పక్కన పెట్టండి. లాజిక్‌గా కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు ప్రస్తావిస్తున్న వాటిపై నేను కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నాను. ఎవరైనా సారా కాసేవారు, 55 వేల జనాభా ఉంటున్న జంగారెడ్డిగూడెంలో సారా కాయగలరా? పైగా అది ఒక మున్సిపాలిటీ. అక్కడ 2011 లెక్కల ప్రకారం 44 వేల జనాభా ఉంది. ఇప్పుడు అక్కడ దాదాపు 55 వేల జనాభా ఉంది. అక్కడే పోలీస్ స్టేషన్, వార్డు సచివాలయాలు ఉన్నాయి. మహిళా పోలీస్‌లు కూడా ఉన్నారు. వాళ్లందరి కళ్లు గప్పి సారా కాయడం సాధ్యమా? ఎక్కడో మారుమూల గ్రామంలో, నిర్జన ప్రదేశంలో సారా కాస్తున్నారంటే నమ్మొచ్చు. అంతేకానీ జంగారెడ్డిగూడెం వంటి పట్టణంలో సారా కాయడం సాధ్యమా?
సారా కాసే వారికి మేము అండగా నిల్చే ప్రసక్తే లేదు. పైగా వారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. మేం వచ్చాక ఎస్‌ఈబీ ఏర్పాటు చేసి, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. అక్రమ మద్యానికి సంబంధించి ఇప్పటికే 13 వేల కేసులు నమోదు చేశామంటే, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది అర్ధం అవుతుంది.
ఇక చంద్రబాబు ప్రకటన చూస్తే.. ఆశ్చర్యం కలుగుతోంది.
ఆయన ఏమంటాడంటే.. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అప్పు తేవడంతో పాటు, మరో రూ.25 వేల కోట్లు అప్పుకు సిద్ధం అవుతున్నామని, మరోవైపు మద్యం విక్రయాలు బాగా పెంచి, ఇంకా ఆదాయం పొందాలని చూస్తున్నామని చంద్రబాబు అన్నారు.
మరి ఆయన ఆ మాట అంటూనే, మరో మాట ఏమంటాడు. సారా తాగి మనుషులు చనిపోయారంటున్నాడు. అంటే తాను అన్న మాటలను తానే విభేదించాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు. ఒక మాటకు, రెండో మాటకు పొంతన ఉండడం లేదు.
మద్యం అమ్మకాలు పెంచుతున్నామని అంటూనే, జనం సారా తాగుతున్నారని మరోవైపు విమర్శిస్తున్నాడు. అసలు సారా తాగిస్తే, ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా? అంటే కనీస కామన్‌సెన్స్ లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.
ప్రతి గ్రామంలో 90 సహజ మరణాలుంటాయని సీఎం అన్నారని ఈనాడులో వ్యంగ్యంగా రాశారు. జంగారెడ్డిగూడెంలో 55 వేల జనాభా ఉంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 44 వేల జనాభా ఉంది. 10 ఏళ్ల తర్వాత 12 శాతం పెరుగుదలతో ఇవాళ అక్కడ 55 వేల జనాభా ఉందని చెబుతున్నాం.
అదే విధంగా ఇవాళ దేశంలో 2 శాతం మరణాల రేటు ఉంది. ఇది నేను చెబుతున్నది కాదు. రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆ మరణాలు వృద్ధ్యాప్యంవల్ల కావొచ్చు. అనారోగ్యంతో కావొచ్చు. లేదా మరే ప్రమాదం వల్ల అయినా కావొచ్చు. ఆ మేరకు 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 2 శాతం సగటు తీసుకుంటే, ఏటా దాదాపు 1000 మంది చనిపోతున్నారు. అంటే నెలకు దాదాపు 90 మంది చనిపోతున్నట్లు అవుతుంది. దాన్ని బట్టే నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను. కానీ ఈనాడు పత్రిక దాన్ని కూడా వక్రీకించి రాసింది.
నిజానికి జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే చోట, ఒకే రోజు జరగలేదు. వేర్వేరు చోట్ల, ఒక వారం రోజుల్లో ఆ మరణాలు చోటు చేసుకున్నాయి. నిజానికి మరణించిన వారి అంత్యక్రియలు కూడా జరిగాయి. అప్పుడు ఏం గొడవలు జరగలేదు. ఒకచోట ప్రభుత్వమే చొరవ చూపి, పాతిపెట్టిన ఒక భౌతిక కాయానికి పోస్టుమార్టమ్ నిర్వహించింది.
ఒకవేళ నిజంగానే అది సారా మరణం అయితే, ప్రభుత్వం ఆ విధంగా పోస్టుమార్టమ్ నిర్వహిస్తుందా?
వారి మనస్తత్వం, ఆలోచన ఒక్కటే. ఒక అబద్ధం తీసుకురావాలి. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఢంకా భజాయించాలి. ఆ విధంగా గోబెల్ ప్రచారం చేయాలి. అంటే ఒకే అబద్ధాన్ని 100సార్లు చెబితే, ప్రజలు నమ్ముతారని వారి నమ్మకం. అందుకే ముందు ఒకరు అందుకుంటారు. ఆ వెంటనే మిగిలిన వారు, చంద్రబాబు పదే పదే అదే చెబుతారు, కేవలం మీడియా, వాటి యాజమాన్యాలు, చంద్రబాబు.. అందరూ కలిసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. ఏమీ జరగని దాన్ని జరిగినట్లు చూపే విష ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు.
ఈరోజు రాష్ట్రానికి మంచి చేయడానికి అక్కడ కూర్చుని సలహాలు ఇవ్వండి. స్వీకరిస్తాం. అంతే తప్ప ఇలా ప్రవర్తించి, కార్యక్రమాలు అడ్డుకోవద్దు.
బడ్జెట్ చర్చల్లో పాలు పంచుకోండి. సలహాలు ఇస్తే నోట్ చేసుకుంటాం. కాబట్టి పద్ధతి మార్చుకోండి.
లేదు. ఇలాగే ఉంటాం అంటే మీ ఇష్టం. ఇప్పుడు ఒక రూల్ ప్రస్తావించారు. దాని ప్రకారం మీరు సస్పెండ్ అవుతామంటే మీ ఇష్టం.. అని ముఖ్యమంత్రి అన్నారు.
Post a Comment