నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పనితీరు పట్ల పూనె అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వార్డు సచివాలయ వ్యవస్థ, పంచాయితీ, జిల్లా ప్రజా పరిషత్ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జడ్పీ, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖ అధికారులతో కూడిన బృందం శుక్రవారం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో భేటీ అయింది.
ఈ సందర్భంగా జిల్లాలో సచివాలయాలు, జడ్పీ, పంచాయితీ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల పనితీరు, సిబ్బంది విధులు తదితర అంశాలను జడ్పీ సీఈవో శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు. ముఖ్యంగా జిల్లాలో 940 గ్రామపంచాయతీలు, 5 రెవెన్యూ డివిజన్లు, 46 జడ్పిటిసి స్థానాలు, 46 ఎంపీపీ స్థానాలు, 552 ఎంపీటీసీ స్థానాలు, 304 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రతి 2 వేల ఇళ్లకు ఒక సచివాలయం, సచివాలయం పరిధిలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పనిచేస్తున్నారని, మండలాల్లో మండల పరిషత్ అధికారుల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రెవిన్యూ అధికారుల ద్వారా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు పంచాయితీ, జడ్పీ శాఖల పర్యవేక్షణలో చేపడుతున్నట్లు బృంద సభ్యులకు వివరించారు.
జిల్లాలో చేపడుతున్న ఉపాధి హామీ పథకం, జగనన్న శాశ్వత భూ హక్కు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన వంటి పథకాల పనితీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల పనితీరు చాలా బాగుందని కొనియాడారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ మేడా శ్రీనివాస్ కుమార్, పశుసంవర్ధక శాఖ జె.డి మహేశ్వరుడు తమ శాఖల పనితీరును బృంద సభ్యులకు వివరించారు.
అనంతరం సభ్యులు జెడ్పి చైర్ పర్సన్ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో పూణే జడ్పీ డిప్యూటీ సీఈఓ మిలింద్ టొనపె, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రకాష్ ఖాతల్, ఇతర సభ్యులు విధాత్ శివాజీ, సుధీర్ భాగవత్, శేఖర్ గైక్వాడ్, శివరాం షెడ్జ్, వికాస్ కుదావే పాల్గొన్నారు.
Post a Comment