శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
తమ స్టడీ టూర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ పుట్టుక, ప్రస్థానం, ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. శ్రీసిటీ కార్పొరేట్ సామాజిక భాద్యత (సిఎస్ఆర్) కార్యక్రమాల గురించి చెబుతూ, నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, సామాజిక మౌళిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించడం ద్వారా శ్రీసిటీ పరిసర వెనుకబడిన ప్రాంతం ఎలా అభివృద్ధి సాధించిందో వివరించారు.
ఇక్కడ ప్రపంచశ్రేణి మౌళికవసతులు, వ్యాపారానుకూల వాతావరణం పట్ల ట్రైనీ ఐఏఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ స్పష్టమైన దృష్టి, మంచి ప్రణాళిక, ఖచ్చితమైన అమలు, ఉపాధి కల్పన, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలను ప్రశంసించిన అధికారులు, దీనికి కృషిచేసిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ పర్యటనపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, ట్రైనీ ఐఏఎస్ ల అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. ట్రైనీ ఐఏఎస్ లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీసిటీని "తప్పనిసరి ఆప్షన్" గా ఎంచుకోవడం తమకు గర్వకారణమన్నారు.
ఏపీ దర్శన్ లో భాగంగా శ్రీసిటీకి విచ్చేసిన ఐఏఎస్ శిక్షణ అధికారులు, ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి తమ పలు సందేహాలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు ఆల్స్టామ్, మాండెలెజ్, ఇసుజు, టోరె పరిశ్రమలను సందర్శించారు.
Post a Comment