శ్రీసిటీని సందర్శించిన కేంద్ర కమిటీ

శ్రీసిటీని సందర్శించిన కేంద్ర కమిటీ 
- ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల సవరణపై సమావేశం

రవి కిరణాలు న్యూస్ ( శ్రీసిటీ) :

ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల సవరణ  (RoDTEP)  నిర్ణయ కమిటీ  బృందం  మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. మాజీ కేంద్ర హోం మరియు వాణిజ్య కార్యదర్శి జికె పిళ్లై (రిటైర్డ్ ఐఏఎస్) నేతృత్వంలో రిటైర్డ్ CBEC  స్పెషల్ సెక్రటరీ వైజి పరాండే, కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ (రిటైర్డ్) గౌతమ్ రే కమిటీ సభ్యులుగా సందర్శనకు విచ్చేయగా, వీరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ  హసన్ అహ్మద్, డిప్యూటీ  DGFT  ప్రవీణ్ కుమార్ పర్యటనలో పాల్గొన్నారు. శ్రీసిటీ SEZ మరియు DTZలోని పరిశ్రమల సీనియర్ మేనేజర్‌లతో వీరు పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా తన గత శ్రీసిటీ పర్యటనలను గుర్తు చేసుకున్న పిళ్లై, తక్కువ వ్యవధిలో సాధించిన పారిశ్రామిక వృద్ధిని ప్రశంసించారు. ఎగుమతులపై సుంకాలు, పన్నులు ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఎగుమతులకు RoDTEP రేట్లను నిర్ణయించడానికి ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభిప్రాయాలను తమ కమిటీ సేకరిస్తుందని చెప్పారు. పన్నులు మరియు సుంకాల రీయింబర్స్‌మెంట్‌ను సులభతరం చేయడానికి, తమ ఉత్పత్తుల ధరలను నిర్దేశిత ఫార్మాట్‌లో ఇవ్వాలని ఆయన కంపెనీలకు సూచించారు. 

కమిటీకి సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైనందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పన్నులు మరియు సుంకాల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అన్ని ప్రశ్నలకు అవసరమైన ఇన్‌పుట్‌లు ఇవ్వాలని మరియు వివరణలు కోరాలని కంపెనీల ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇన్‌పుట్ ఫార్మాట్‌లు, ఇతర నిబంధనలను కంపెనీలు బాగా అర్థం చేసుకునేలా, సబ్జెక్ట్‌పై వెబ్‌నార్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కమిటీ ఛైర్మన్‌కు విన్నవించారు. 

ఎగుమతుల కోసం RoDTEP రేట్లను నిర్ణయించడానికి మరియు RoDTEP రేట్ల షెడ్యూల్‌కు సంబంధించి లోపాలు లేదా క్రమరాహిత్యాలకు సంబంధించిన సమస్యలపై సిఫార్సులను అందించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఎగుమతి చేసే పరిశ్రమలు వివిధ కేంద్ర రాష్ట్ర సుంకాలు, పన్నులు మరియు వివిధ స్థాయిలలో ఇన్‌పుట్ ఉత్పత్తులపై విధించిన లెవీల వాపసును నిర్ణయించడానికి కమిటీకి తమ ప్రతిపాదనలను సమర్పించాలని కోరారు.

పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు శ్రీసిటీ పరిసరాలు చుట్టిచూడడంతో పాటు ఫాక్స్‌కాన్, జెన్ లినెన్ ఇంటర్నేషనల్, సిద్ధార్థ లాజిస్టిక్స్, ఆస్ట్రోటెక్ స్టీల్స్ మరియు హెల్తియం పరిశ్రమలను సందర్శించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget