రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులతో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో గంటసేపు సమావేశమైన జగన్, విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం జగన్.. రాష్ట్రానికి రుణపరిమితి పెంపు, సవరించిన అంచనాలకు అనుగుణంగా పోలవరం నిధుల పెంపు వంటి అంశలపై చర్చించారు. సోమవారం సాయంత్రం కేంద్ర విమానయానశాఖ జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయిన సీఎం జగన్.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అనుమతులపై చర్చించారు.
ఇక మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. ఏపీలో రహదారుల నిర్మాణం,జాతీయ రహదారుల ఏర్పాటు పై కేంద్ర మంత్రితో గంట పాటు చర్చించారు. పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ లో తీరప్రాంత అభివృద్ధికి సహకరించాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. ఈమేరకు రాష్ట్రంలోని ప్రధాన తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం నుంచి భోగాపురానికి మధ్య జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడ తూర్పు హైవే ఏర్పాటుపై కేంద్రమంత్రితో జగన్ చర్చించారు. కేంద్రం నుంచి అనుమతులు రాక రాష్ట్రంలో ఆగిపోయిన పెండింగ్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు
Post a Comment