ఎట్టకేలకు పట్టణంలోని మున్సిపల్ కుళాయిలలో మంచినీరు సరపరా అయింది. ఇదేంటి మంచినీటి కుళాయిలలో మంచినీరు కాకుండా ఇంకేం నీరు సరఫరా అవుద్దని అనుకుంటున్నారా.. నిజమే మరి.. గత నాలుగు నెలలుగా గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాలలోని కుళాయిలలో దుర్ఘంధభరితమైన నీరు చెత్త చెదారంతో కూడిన వ్యర్థ నీరు సరఫరా అవుతోంది. ఈ నీరు తాగేందుకు కాదుకదా స్నానం చేసేందుకు, ఇతర అవసరాలకు సైతం వినియోగానికి వీలులేని విధంగా ఉండేది.
ఈ విషయాన్ని స్థానిక ప్రజలు ఇన్సాఫ్ సమితి దృష్టికి తీసుకొచ్చారు. ఇన్సాఫ్ సమితి సభ్యులు పట్టణంలోని పెద్ద మశీదువీధి, బనిగిసాహెబ్ పేట, బజారు వీధి, సొసైటీ ప్రాంతాలలో నీరు సరఠరా చేసే సమయంలో ప్రత్యక్షంగా పరిశీలించారు. కొన్ని ప్రాంతాలలో దుర్ఘంధభరితమైన నీరు, మరికొన్ని ప్రాంతాలలో మున్సిపల్ కుళాయిలలో సరఫరా అవుతోన్న చెత్త, చెదారంతో కూడిన నీరు సరఫరా అవుతుండడం గమనించారు. ఆ నీటిని బాటిళ్లలో పట్టి కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. సమస్య వివరించారు. దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వెంటనే ఆ శాఖ సిబ్బందిని పిలిపించారు. పట్టణంలో మంచినీటి కుళాయిల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో ఫిట్టర్లు ప్రతి రోజూ ఆయా ప్రాంతాలలో తిరిగి సమస్య పరిష్కారానికి శ్రమించారు. దీంతో బనిగిసాహెబ్ పేట, సొసైటీ, బజారు వీధి ప్రాంతాలలో సమస్య పరిష్కారానికి నోచుకుంది. అయితే పెద్ద మశీదు వీధి, కంచుకోట, శివాలయం వీధులలో దుర్ఘంధ భరిత, చెత్త చెదారంతో కూడిన నీరు సరఫరా అవుతూనే ఉంది. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఫిట్టర్లు పట్టణంలో నిత్యం రద్ధీగా ఉండే బజారువీధిలో మెయిన్ పైప్ లైన్ ను తవ్వి కాలువలోని పూడికను తొలగించారు.
ఆ ప్రాంతంలో పెద్ద డ్రైనేజీ కాలువ కింది వైపున ఉన్న మెయిన్ పైప్ లైన్ లీకై కాలువలోని మురుగునీరు పైపులలో చేరుతుండడం వలన మంచినీటితో కలిసి మురుగునీరు కూడా ప్రవహిస్తోందని గుర్తించారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మతులు చేపట్టి లీకులు అరెస్టు చేయించారు. దీంతో సుమారు నాలుగు నెలల పాటు సరఫరా అయిన దుర్ఘంధభరితమైన నీటికి చెక్ పెట్టినట్లయింది. మంగళవారం నుండి పెద్ద మశీదు వీధి, కంచుకోట, శివాలయం వీధి తదితర ప్రాంతాలలో దుర్ఘంధం, చెత్త చెదారం లేని మంచి నీరు సరఫరా అయింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కమిషనర్ కు కృతజ్ఞతలు : ఇన్సాఫ్ సమితి
సమస్య కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పది మంది సిబ్బందితో పట్టణంలో సమస్య ఉన్న ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారని ఇన్సాఫ్ సమితి జిల్లా కార్యదర్శి షేక్. జమాలుల్లా అన్నారు. ప్రజారోగ్యాన్ని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కరానికి చొరవ చూపిన మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై స్పందించే అధికారి కమిషనర్ గా ఉండడం గూడూరు పట్టణ ప్రజల అదృష్టమన్నారు. అలాగే గత రెండు నెలలుగా ప్రతిరోజూ వేకువజామున సమస్య ఉన్న ప్రాంతాలలో పర్యటించడం, చివరికి సమస్యను పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో విస్తృతంగా కృషి చేసిన సీనియర్ ఫిట్టర్ వెంకటాద్రి, సహాయకులు పుట్టయ్య, భాస్కర్, గంగాధర్, రవీంద్రారెడ్డి, పోలయ్య, మణిలకు కూడా ఇన్సాఫ్ సమితితోపాటు ఆయా ప్రాంతాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Post a Comment