ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ జన జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఆదివారం రాత్రి ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే బండి సంజయ్ జాగరణ దీక్షను కొనసాగించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి కరీంగనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీదుగా బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ సహా పలువురిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్, పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పలుమార్లు కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు కేసులు నమోదు చేశామన్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, పైగా పోలీసులపై దాడి చేశారని, పలువురు పోలీసులకు కూడా గాయాలు అయినట్టు పేర్కొన్నారు. బండి సంజయ్ దీక్షకు అనుమతి తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు.
కోవిడ్ నేపథ్యంలో కేంద్రం, హైకోర్టు, సుప్రీంకోర్టు Goms నంబర్ 1 ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. వీటిని పకడ్బందీగా అమలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయనే ముందుగానే నోటీసు ఇచ్చామన్నారు. దీక్షలో వందలాది మంది గుమిగూడారని బండి సంజయ్‌కు చెప్పామన్నారు. దీక్ష ప్రాంగణంలో మాస్క్ లు ధరించకుండా.. సోషల్ డిస్టెన్స్ లేకుండా కోవిడ్ నిబంధనలు పాటించలేదని.. ఎన్నిసార్లు చెప్పినా వినలేదని పోలీసులు చెప్పారు. దాంతో DMA యాక్ట్ కింద కింద బండి సంజయ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు తెలిపారు.
పోలీసులపై దాడి చేసినందుకు మరో 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఎంపీ సంజయ్ కూడా ఉన్నారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.
Post a Comment