మెడలో నగలు ఉంటే పెన్షన్ రాదంటూ మోసం!
కేటుగాళ్లు రోజు రోజుకు రాటుదేలుతున్నారు. కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలోలని పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన చోరీ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇంతకీ ఏం జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా గులుమూరుకు చెందిన ఓ వృద్ధురాలు బస్సు కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి తాను గులుమూరు వీఆర్వోగా పరిచయం చేసుకున్నాడు. పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల కోసం ఫోటోలు తీసుకోవాలని నమ్మబలికాడు. మెడలో బంగారం ఉంటే సంక్షేమ పథకాలు వర్తించవని వాటిని తీయాలని ఆమెతో చెప్పాడు.
దీంతో ఆమె తన మెడలో ఉన్న ఆభరణాలు, చెవి కమ్మలు తీసి చీర కొంగుకు కట్టుకోసాగింది. ఈ క్రమంలో తాను సహాయం చేస్తున్నట్లు నటించిన అగంతకుడు అసలు నగలను తీసుకుని తన చేతిలో ఉన్న నకిలీ బంగారాన్ని ఆమె చీరకొంగులో కట్టాడు. తీరా ఇంటికి వెళ్లి చూసుకున్న ఆ వృద్ధురాలు షాక్ కు గురైంది. తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించి లబోదిబోమంది. జరిగిన మోసం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా పరిచయం లేని కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Post a Comment