ప్రవక్త బాటలో పయనిద్దాం




ప్రవక్త బాటలో పయనిద్దాం
ఏపీజే, ఇన్సాఫ్ కమిటీల ఆధ్వర్యంలో దోమ తెరల పంపిణీ
 మాట్లాడుతున్న ఏపీజే ట్రస్ట్ ఛైర్మన్ తాజుద్దీన్
 దోమ తెరలు, బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
గూడూరు : మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో పయనించి శాంతియుత సమాజానికి కృషి చేద్దామని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సయ్యద్ తాజుద్దీన్ అన్నారు. మంగళవారం మీలాదున్ నబీ పండుగను పురస్కరించుకుని కాలువ గట్ల పక్కనే మురికివాడలలో నివశిస్తున్న 15మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు దోమ తెరలు, బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచ మానవాళికి దిశా నిర్దేశం చేసిన మహోన్నతుడన్నారు. ఇస్లాం అంటేనే సహాయం చేయడమని చాటిచెప్పిన గొప్ప దార్శనికుడు మహమ్మద్ ప్రవక్త అన్నారు. ఆయన జయంతిన పేదలకు భోజనం పంపిణీ, దోమతెరలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలామ్ ట్రస్ట్ ఛైర్మన్ తాజుద్దీన్ భాయ్ మధ్య తరగతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కోటీశ్వరులు సైతం చేయలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో దోమలు పెరిగిపోతున్నాయన్నారు. ముఖ్యంగా మురికివాడలు, పంట కాలువల పక్కనే నివసించే ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రబలి అల్లాడుతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీజే ట్రస్ట్ సహకారంతో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో దోమతెరలు, బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, ప్రముఖ న్యాయవాది అరవ పార్వతయ్య మాట్లాడుతూ సర్వ మతాల సారాంశం నిజాయితీగా మెలగడం, ఉన్నంతలో ఆపన్నులను ఆదుకోవడమేనన్నారు. ముస్లిం సోదరులకు మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్సాఫ్ కమిటీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్. హాషిమ్ మాట్లాడుతూ ఇన్సాఫ్ కమిటీ చేస్తున్న ప్రజా పోరాటాలకు మెచ్చి కమిటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన తాజుద్దీన్ భాయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలే ఇన్సాఫ్ కమిటీ ధ్యేయమన్నారు. అనంతరం నిరుపేదలకు దోమ తెరలు, బిరియానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలామ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్,  అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు అరవ పార్వతయ్య, ఇన్సాఫ్ కమిటీ డివిజన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా, నియోజకవర్గ అధ్యక్షులు షేక్. హాషిం, డివిజన్ కమిటీ సభ్యులు అహ్మద్ బాష, షేక్. బాషా మొహిద్దీన్, ఏపీజే ట్రస్ట్ సభ్యులు నియామతుల్లా, బర్కతుల్లా మశీదువీధి నిరుపేద ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget