శ్రీసిటీని సందర్శించిన వివేకానంద కేంద్రం ప్రెసిడెంట్
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ) :
కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం ప్రెసిడెంట్ ఎ.బాలకృష్ణన్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలు, వెనుకబడిన ఈ ప్రాంతంలో శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు.
అనంతరం శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధుల పరస్పర చర్చా కార్యక్రమంలో బాలకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివేకానంద బోధనలు, భారత జాతి నిర్మాణానికి ఆయన ఆలోచనల తీరును వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, సాధారణ వ్యక్తులు మరే ఇతర వృత్తుల వారైనా, మన అందరికీ స్వామి వివేకానంద ఒక ప్రేరణ మరియు స్ఫూర్తిదాత అని అభివర్ణించారు. ఆయన తన పూర్తి జీవితాన్ని ఉత్తమ పౌరులను తయారు చేయడానికి, తద్వారా భారతదేశం గతం కంటే ఉన్నత స్థితికి చేరడంపై దృష్టి పెట్టారని చెప్పారు.
భారతదేశ స్వావలంబనపై వివేకానంద ఆలోచనలను వివరించిన బాలకృష్ణన్, స్వావలంబనే మన లక్ష్యంగా స్వామి వివేకానంద బోధనలు చేశారన్నారు. మన మార్గాలు, పద్ధతులు, ప్రక్రియలు, విధానాలు, చర్యలు వేరైనా, మన ప్రధాన లక్ష్యం మాత్రం దేశ స్వావలంబన కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమ ప్రతినిధులందరూ కష్టపడి పనిచేసి తమ ప్రయత్నాలలో విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీసిటీని సందర్శించి, విలువైన సందేశాన్ని అందించినందులకు బాలకృష్ణన్ కు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వివేకానంద బోధనల మార్గంలోనే శ్రీసిటీ ఇతర పరిశ్రమల సహకారంతో విద్య, వైద్యం, భారీ ఉపాధి కల్పన తదితర సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి తమ వంతుగా తిరిగి ఇస్తున్నందుకు సంతోషిస్తున్నామని అని అన్నారు.
కాగా, మానవ సేవే మాధవ సేవ అన్న గొప్ప ఆలోచనతో పనిచేసే వివేకానంద కేంద్రాలు, దేశ భక్తి, సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుంది. స్వామి వివేకానంద మార్గదర్శకత్వంలో భారత జాతి నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా 850 శాఖలు, కార్యాచరణ కేంద్రాలతో వివేకానంద కేంద్రం పనిచేస్తున్నాయి. తమ లక్ష్యాలను సాధించడానికి యోగా, స్టడీ సర్కిల్స్, గ్రామీణాభివృద్ధి, విద్య మరియు యువత మహిళలకు స్వామి వివేకానంద జీవితం, భారతీయ సంస్కృతి, వేద అధ్యయనాలు బోధించడం తదితర వివిధ సేవా కార్యక్రమాలను ఈ కేంద్రాలలో నిర్వహిస్తారు.
Post a Comment