నెల్లూరులో చారిత్రక వి.ఆర్.విద్యాసంస్థల పరిరక్షణ కోసం రాజకీయాలకతీతంగా పోరాడుతాం -జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

 నెల్లూరులో చారిత్రక వి.ఆర్.విద్యాసంస్థల పరిరక్షణ కోసం రాజకీయాలకతీతంగా పోరాడుతాం 

-జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి 

--------------------



ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా నిర్వీర్యమవుతూ మూతపడిన వి.ఆర్.విద్యాసంస్థల పరిరక్షణ కోసం నేడు నెల్లూరు సిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నగరంలోని వి.ఆర్.కళాశాల ఎదుట మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. తొలుతగా వి.ఆర్.సి కూడలిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం కేతంరెడ్డి మీడియాతో మాట్లాడారు. 


ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో ను చూపించారు. ఆ మేనిఫెస్టో లో విద్యకు సంబంధించి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వని విధానాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు రంగులేయడం గురించి మాత్రమే ఆ మేనిఫెస్టోలో చెప్పారు కానీ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజిలను, ఎయిడెడ్ విద్యాసంస్థలను, రాష్ట్ర యూనివర్శిటీలను తామెలా అభివృద్ధి చేస్తామో మాట మాత్రమైనా ప్రస్తావన లేకపోవడం ఆ పార్టీకి, వారి ప్రభుత్వానికి ఉన్నత విద్య మీద అసలు చిత్తశుద్ధే లేదనే వాస్తవాన్ని తెలియజేస్తుందని అన్నారు. మేనిఫెస్టోలో ఉన్నవే కాదు లేనివి కూడా చేస్తున్నాం అని నేడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనంగా ప్రకటిస్తున్నారని, దానర్థం మేనిఫెస్టోలో లేనటువంటి ఈ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలను, పాఠశాలలను, వాటి ఆస్తులను అమ్ముకోవడమే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్న నిదర్శనం అని అన్నారు. 1875వ సంవత్సరంలో బ్రిటిష్ హయాంలోనే ఆనాడు వెంకటగిరి రాజా వారు సేవా దృక్పధంతో ప్రతిఒక్కరికి విద్య అందాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేయగా 1920వ సంవత్సరం నుండి వి.ఆర్. కళాశాల డిగ్రీ విద్యను అందిస్తున్నదని పేర్కొన్నారు. ఎందరో దాతల కృషితో వందేళ్ళకు పైగా ఉన్నత విద్యను అందిస్తూ నెల్లూరు నగరానికి గుండె కాయిలా మారినటువంటి వి.ఆర్.కళాశాలను నేడు ఈ ప్రభుత్వం మూసివేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. సాక్షాత్తు దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ విద్యాసంస్థల్లోనే హైస్కూల్ విద్యను, కళాశాల విద్యను పొందారని, విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ నేడు దేశంలో సర్వోన్నత స్థాయిలో ఉన్నారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, డీఆర్డీఓ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి గారు, తమ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పూర్వ విద్యార్థులే అని తెలిపారు. ఇలా ఎందరో ఇక్కడ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా కూడా ఉన్నారని, ఈ విద్యాసంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఇలాంటి పూర్వ విద్యార్ధులందరి మీద ఉందని కోరారు. నెల్లూరు నగరంలో వి.ఆర్.సి మైదానం, వైఎంసి మైదానం, వి.ఆర్.పాఠశాల, కళాశాలలతో కలిపి 17 ఎకరాల అత్యంత విలువైన భూములు ఈ సంస్థలకు ఉన్నాయని తెలిపారు. నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఒక్క సంస్థల విలువే సుమారు 1000 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. వి.ఆర్.సి తో పాటు నగరంలో మిగిలిన ఎయిడెడ్ వ్యవస్థలైన సర్వోదయ, కస్తూరిదేవి, ఎస్.వి.జి.ఎస్, ఆర్ఎస్ఆర్, జి.వి.ఆర్.ఆర్, వేద సంస్కృత కళాశాల వంటి సంస్థల విలువ 3500 కోట్ల రూపాయలకు పైమాటేనని ఇప్పుడు ప్రభుత్వం దృష్టి ఈ ఆస్తులను ఎలా కాజేయాలనే దానిపైన పడిందని అందుకే ఈ వ్యవస్థలను కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే కస్తూరిదేవి విద్యాసంస్థల ప్రాంగణాన్ని పెట్రోల్ బంకులు, కళ్యాణ మండపాలుగా మార్చేసి వ్యాపారాన్ని మొదలెట్టేసి ఉన్నారని, సర్వోదయను సైతం ఆ వ్యాపారాల దిశగా తీసుకెళ్తున్నారని, అదే తరహాలో వి.ఆర్.సి అంశంలో వ్యాపారాల కోసం ఎవరితో డీల్ మాట్లాడుతున్నారో అని ఎద్దేవా చేసారు. ప్రభుత్వానికి చేతనైతే ప్రభుత్వ అధ్యాపకులను పెట్టి అద్భుతమైన విద్యను అందించే అవకాశం ఉందని కానీ ఈ ప్రభుత్వంలో అలా జరగట్లేదని నవరత్నాల్లో చెప్పిన డబ్బు పంపిణీ కోసం అప్పులు కూడా పుట్టక ఇప్పుడు వి.ఆర్.సి లాంటి సంస్థలను అమ్మేసే ప్రక్రియకు ప్రభుత్వం బరితెగించి తెరతీసిందన్నారు. నెల్లూరు నగరంలో బాలికలకు డి.కె.డబ్ల్యూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందని కాని సమగ్రంగా అందరికీ విద్యనందించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదని, పేద ప్రజలకు వి.ఆర్.కళాశాల ఒక్కటే దిక్కని తెలిపారు. అలాంటి కళాశాలను స్వార్ధంతో కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానం పై ఖచ్చితంగా తాము  పోరాడుతామని, పార్టీలకతీతంగా వి.ఆర్.విద్యాసంస్థల పరిరక్షణ కోసం జనసేన పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు పోరాడుతాయని ఆయన తెలిపారు. 


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు  కాకు మురళి రెడ్డి, చెరుకూరు హేమంత్ రాయల్, రాము, సురేష్, మోష, జీవన్, శ్రీను ముదిరాజ్, ఖాదర్, కార్తీక్, గణేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget