రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “
పేదలందరికీ జగనన్న ఇళ్ళు” పథకం అమలులో జిల్లా ఐదో స్థానంలో ఉందని, ఈ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులందరూ సమష్టి కృషితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మనుబోలు, గూడూరు సమీపంలోని జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన చేపట్టిన మెగా హౌసింగ్ మేళాలో వివిధ దశల్లో ఉన్న 400 ఇళ్ళు పూర్తయ్యే దశకు వచ్చాయన్నారు. ఇదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా వ్యాప్తంగా మెగా హౌసింగ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తున్నామని, లే అవుట్లలోనే ఇటుకల తయారీని చేపట్టినట్లు వివరించారు. జిల్లాకు మంజూరైన 79 వేల ఇళ్లను రానున్న ఐదు నెలల్లో పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే వరకు కూడా సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం లో భాగస్వాములై సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు.
అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నామని, మరో 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తే 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి జిల్లాగా రాష్ట్రంలో మన జిల్లా నిలుస్తుందన్నారు. ఆ దిశగా ఈ వారం రోజులపాటు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విదేహ్ ఖరె, జాయింట్ కలెక్టర్ (ఆసరా), మండల ప్రత్యేక అధికారి శ్రీమతి రోజ్ మాండ్, జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి శ్రీ వేణుగోపాల్, ఆర్డిఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, గూడూరు ఆర్డిఓ శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
Post a Comment