విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : సి.ఐ.టి.యు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్, నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళవారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 33 మంది అమరవీరుల త్యాగ ఫలితం విశాఖ ఉక్కు అని దీన్ని అమ్మే హక్కు కేంద్రానికి లేదని అన్నారు. నాడు పార్టీలకు అతీతంగా 70 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసి కేంద్రం మెడలు వంచి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించారని దీన్ని అమ్మాలని చూస్తే ఆంధ్రులు సహించబోరని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు అని, నవరత్నాల్లో ఒకటైన విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని అయినా విశాఖ ఉక్కు కార్మికులు పట్టుదలతో పరిశ్రమకు ఆదాయాలు వచ్చేలా కష్టించి పనిచేస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో భారతదేశంలోని అనేక రాష్ర్టాలకు విశాఖ ఉక్కు పరిశ్రమ ఆక్సిజన్ అందించిన విషయం కేంద్రంలోని పెద్దలు గ్రహించాలని హితవు పలికారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే పరిశ్రమని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూలం రమేష్, నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు, సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు, కె పెంచలనర్సయ్య, నగర కమిటీ సభ్యులు పి సూర్యనారాయణ, మూలం ప్రసాద్, జీ సుధాకర్ రెడ్డి, సుధాకర్, ఆటో యూనియన్ నగర నాయకులు మురళి, నాగూర్, జగదీష్, లక్ష్మీనారాయణ, కొట్టుముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రామయ్య, శ్రీనివాసులు, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కాశయ్య, ఎన్ వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Post a Comment