రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ కేంద్రాలు
..జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారంలోగా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె విఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. . మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ రెవిన్యూ సంయుక్త కలెక్టర్ హరెందిర ప్రసాద్ తో కలిసి సంబంధిత అధికారులు, రైతులు, రైస్ మిల్లుల సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎడగారు వరి పంట కోత దశకు వచ్చిందని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రం పరిధిలో అవసరమైన పరికరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు అన్ని విధాల సహకారం అందించే విధంగా ఆర్ బి కె సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. అవసరమైనన్ని గోతం సంచులు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు రవాణా ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. ప్రతిరోజు ఏ ఊరు నుండి ఎంతమేరకు పంట వస్తున్నదో అంచనా వేయాలని , ఏ రోజు ఏ రైతు పంట కోత కోస్తారో ఎంత మేరకు మార్కెట్కు వస్తుందో ఏ రకం పంట ధాన్యం సేకరించాలి అనే విషయాలపైన స్పష్టమైన ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని స్పష్టం చేశారు. రైతులను ఎవరు ఇబ్బంది పెట్టకుండా వి ఆర్ ఓ లు తదితర రెవెన్యూ యంత్రాంగం గట్టి నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా సంఘటనలు జరిగితే తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రైతుకు మిల్లర్లకు మధ్య ఎటువంటి సంబంధం లేదని అంతా రైతు భరోసా కేంద్రాలు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయన్నారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై ముందస్తుగానే రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం కరపత్రాలు ద్వారా పూర్తి సమాచారం రైతులకు తెలియజేయాలన్నారు. రెవిన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ తో పాటు వ్యవసాయ పరపతి సంఘాలు, మహిళా సంఘాలు కలిసికట్టుగా సమన్వయంతో నడవాలన్నారు. ఎలాంటి సమాచారం లోపం ఉండరాదని రైతుల్లో ఆందోళన రాకుండా చూడాలన్నారు. మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు కూడా వారి స్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలన్నారు. రైతులకు ఎవరికైనా సమస్యలు ఉంటే 1077 నంబర్కు తెలియజేసిన ఎడల వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 70 శాతం 1010 వరి ధాన్యం పంటను సాగు చేస్తున్నారని ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పినప్పటికీ అదే రకం పండించడం సమంజసం కాదన్నారు. అందరూ తినే రకం వరి ధాన్యాన్ని పండిస్తే చాలా బాగుంటుంది అన్నారు. వీలైనంతవరకూ రెండో పంటగా మినుములు పెసలు తదితర ప్రత్యామ్నాయ పంటలు వేస్తే బాగుంటుంది అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ శివ నారాయణ, డి ఎస్ ఓ శ్రీ సుధాకర్, పౌరసరఫరాల డి ఎం శ్రీమతి పద్మ, డి సి ఓ తిరుపాల్రెడ్డి , రైతు సంఘాల నాయకులు రాధాకృష్ణ నాయుడు , శేషయ్య, రామ్మోహన్ రెడ్డి, వెంకమరాజు రైస్ మిల్లుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -----------------------------------
Post a Comment