పానిపట్ కుర్రాడి 11 ఏళ్ల శ్రమ టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు

 ఒక అథ్లెట్‌గా రాణించాలంటే శారీరక ధృఢత్వం చాలా అవసరం. అన్ని విధాలా ఫిట్‌గా ఉన్నవారు మాత్రమే అథ్లెట్‌గా విజయాలు సాధించగలరు.

పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్, మిల్ఖా సింగ్ వంటి కొద్ది మంది భారతీయులు మాత్రమే అథ్లెటిక్స్‌లో ప్రపంచ స్థాయి విజయాలు సాధించారు. ఈ ముగ్గురూ కొద్ది పాటి తేడాతో ఒలింపిక్ పతకాలకు దూరమయ్యారు. ఆ వెలితిని నీరజ్ చోప్రా భర్తీ చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. అయితే, నీరజ్ చోప్రా జావెలిన్ విసరడం ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? ఒలింపిక్ పతకం వరకూ ఆయన సాగించిన ప్రయాణంలోని అయిదు కీలకమైన మలుపులివే.

1. పానిపట్ కుర్రాడి 11 ఏళ్ల శ్రమ

హర్యానాలోని పానిపట్ సమీపంలో ఉన్న ఖాండ్రా గ్రామంలో నీరజ్ జన్మించారు. వారిది రైతు కుటుంబం. నీరజ్ 2010లో పానిపట్‌లోని క్రీడా మైదానంలో జస్బీర్ సింగ్ జావెలిన్ విసురుతుంటే చూశారు. అప్పుడు ఆయన వయసు 11 ఏళ్లు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన దృశ్యం.

"ఆ ఆటలోని వేగం నన్ను మురిపించింది. జస్బీర్ దేహ దారుఢ్యం, అతను పరిగెట్టే తీరు నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఆటలు చూడడం నాకిష్టంగా ఉండేది. కానీ, ఈ ఆట చూశాక నాకే ఆడాలనిపించింది" అని నీరజ్ కొన్నేళ్ల కిందట చెప్పారు.

BEN STANSALL

2. అప్పుడు నీరజ్ బరువు 80 కిలోలు

పాలు, వెన్న అమ్ముకునే రైతు కుటుంబంలో పెరిగిన నీరజ్ అప్పుడు చాలా బరువుగా ఉండేవారు. వాళ్ల నాన్న అతడిని బరువు తగ్గించడం కోసం పానిపట్‌కు తీసుకొచ్చారు. జావెలిన్ ప్రాక్టీస్‌లోనే ఉంటే బరువు తగ్గవచ్చని ఆయన భావించారు.

నీరజ్‌కు ఆ ఆట బాగా నచ్చింది. అదే ఆయనకు సర్వస్వమైపోయింది. మొదట్లో ఆయన పానిపట్‌లో జై చౌదరి వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత పాటియాలా స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో ప్రపంచ ప్రఖ్యాత జావెలిన్ క్రీడాకారుడు యువే హూన్ స్వయంగా నీరజ్‌కు ప్రొఫెషనల్ శిక్షణ ఇచ్చారు. జావెలిన్‌లో 100 మీటర్ల రికార్డును సృష్టించిన ఏకైక క్రీడాకారుడు యువే హూన్.

నీరజ్ 2016లో అండర్-20 వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచారు. 2018 కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ జావెలిన్ ఆటగాడు నీరజ్. ప్రస్తుతం ఆయన స్వీడన్‌కు చెందిన క్లాజ్ బార్టోనెజ్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.

3. ఒలింపిక్స్‌కు ముందు కుడి చేతికి గాయం

ఆటల్లో గాయాలు అవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని గాయాలు కెరీర్‌ను దెబ్బతీసేవిగా ఉంటాయి. 2012లో పానిపట్‌లో బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు నీరజ్ మణికట్టుకు గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ ఆట కొనసాగించారు.

మళ్లీ 2019లో అదే చేతికి గాయమై దాదాపు 8 నెలలు క్రీడకు దూరమయ్యారు. ఆ గాయం నుంచి కోలుకోవడం నీరజ్‌కు సవాలుగా మారింది. ఎట్టకేలకు ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ నిర్వహించిన టెస్ట్ కాంపిటీషన్లో ఆయన 83 మీటర్ల దూరానికి జావెలిన్ విసరగలిగారు.

ఆయన పట్టుదల, నిర్విరామ శ్రమ ఎలాంటిదో అసలైన వేదిక మీద నిరూపితమైంది. ఒలింపిక్స్‌లో నీరజ్ 87.58 మీటర్ల దూరానికి జావెలిన్ త్రో చేసి గోల్డ్ మెడల్ సాధించారు.

4. స్కూలు చదువు వదిలేయాల్సి వచ్చింది

పన్నెండేళ్ల వయసులో జావెలిన్ త్రో ఆడడం ప్రారంభించిన నీరజ్ స్కూలు చదువును మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. 10, 12 తరగతుల ప్రైవేటుగా కట్టి పాసయ్యారు.

ఇప్పుడు కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి కరెస్పాండెన్స్ బీఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 18 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ కోటా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వచ్చింది డిగ్రీ లేకపోయినా ఆయనకు డిప్యూటీ సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు.

రాజ్‌పుతానా రైఫిల్స్‌లో ఉన్న నీరజ్‌కు ఒలింపిక్ మెడల్ గెలవగానే మొదటి ప్రశంసలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచే లభించాయి.

5. నీరజ్ ఇప్పటిదాకా గెలిచిన పతకాలు, అవార్డులు

19 ఏళ్ల వయసులో అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడంతో నీరజ్ మొదటిసారి వార్తల్లోకెక్కారు. అప్పుడు కూడా ఆయన 86.48 మీటర్లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ ఘనత సాధించినందుకు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఆయనను అభినందిస్తూ ఒక పోస్ట్ రాశారు.

2018లో నీరజ్ కామన్‌వెల్త్ క్రీడల్లో, ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయనను అర్జన అవార్డుతో సత్కరించింది.

ఇదీ పానిపట్ పల్లె నుంచి టోక్యో ఒలింపిక్ గోల్డ్ దాకా నీరజ్ సాగించిన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆయన ప్రతి దశలోనూ ముందడుగే వేశారు. స్థిరంగా ఎదుగుతూ వచ్చారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget