వకీల్ సాబ్ గురించి తర్వాత మాట్లాడొచ్చు నెల్లూరు ప్రజలకు నువ్వేం చేసావో చెప్పు మంత్రి సాబ్ - కేతంరెడ్డి
తిరుపతి ఎంపీ ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలిన రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఎంపీ ఉపఎన్నికల్లో జనసేన పార్టీ బలపరచిన బీజేపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ ని గెలిపించాల్సిందిగా కోరారు. తిరుపతిలో బహిరంగ సభకు హాజరైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కరోనా క్వారంటైన్ కారణంగా నాయుడుపేట సభకు హాజరు కాలేకపోయారని, కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకే తన పర్యటనను వాయిదా వేసుకున్నారని అన్నారు. నాలుగు వేల వాలంటీర్లతో మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రికి, ఉగాది సందర్భంగా గుంపుగా కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రికి తిరుపతి ప్రచారం విషయంలో మాత్రమే కరోనా గుర్తు రావడం జవాబుదారీతనం లేకపోవడానికి సంకేతం అన్నారు.తన అసమర్ధతను ప్రశ్నిస్తే రాజకీయంగా జవాబు కూడా చెప్పలేని స్థితిలో ఉన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దిగజారే రాజకీయాలు చేస్తూ, తన వ్యక్తిత్వ జీవితంలోకి తొంగి చూస్తూ తన కార్యకర్తల చేత వ్యక్తిత్వ హననం చేపిస్తూ శునకానందం పొందుతున్నారని కేతంరెడ్డి పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితం వల్ల నెల్లూరు సిటీ ప్రజలకు కలిగిన నష్టం ఏమీ లేదని, ఎవరి ఇళ్ళు కూలిపోవని ఆయన అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తే ఆ అవమానాలు ఎదుర్కొని, దిగమింగుకుని రెట్టించిన ఉత్సాహంతో మంత్రి అనిల్ అసమర్ధతపై, అక్రమాల పై పోరాడేందుకు తాను సిద్ధమేనని, రేపన్న రోజున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తధ్యం, తాను ఎమ్మెల్యే కావడం తథ్యమని, అప్పటివరకు నెల్లూరు సిటీ అభివృద్ధికి నోచుకునే పరిస్థితులు కనపడడం లేదని కేతంరెడ్డి పేర్కొన్నారు.
Post a Comment