నెల్లూరు నగరంలోని
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., అధికారులు, పరిశ్రమల యజమానులు, యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధిలో జిల్లా ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని, 70 వరకూ భారీ పరిశ్రమలు, కృష్ణపట్నం పోర్టు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తోందని, కానీ, కోవిడ్ వలన ఈ ఏడాది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొమని కలెక్టర్ అన్నారు. లాక్ డౌన్ తొలగించిన తర్వాత పరిశ్రమలు మళ్లీ ప్రారంభమైనాయని, గతంలో వలే పరిశ్రమల నిర్వహణలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ ద్వారా కోవిడ్-19 సమయంలో జిల్లా యంత్రాగానికి అనేక విధాలుగా మెడికల్ పరికరాలు, పి.పి.ఈ కిట్స్ తో పాటు.., పలు రకాలుగా సహాయం అందించారని, 2021లో కూడా పరిశ్రమలు మునుపటిలా అభివృద్ధి పథంలో పయనిస్తూ.., సి.ఎస్.ఆర్ ద్వారా జిల్లా అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కావాలని కోరారు. 70 భారీ పరిశ్రమలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వెనుకబడిన గ్రామాలను సి.ఎస్.ఆర్ పద్దతిలో ఎంపిక చేసుకుని, మోడల్ విలేజెస్ గా తీర్చిదిద్దడానికి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. డి.పి.ఓ, జిల్లా అధికారులు జిల్లాలోని గ్రామాల స్వరూపాన్ని, అభివృద్ధిని పరిశీలించి.., ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలోని అత్యంత వెనుకబడిన 140 గ్రామాల లిస్టును అందిస్తారని, వాటి నుంచి పరిశ్రమలు తాము మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దే గ్రామాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. వయోజన విద్య, గ్రామాల్లో వైద్య సదుపాయాల కల్పన, శానిటైజేష్ కార్యక్రమాలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవచ్చన్నారు. ప్రతి పరిశ్రమ ఎంపిక చేసుకున్న గ్రామంలో తాము అభివృద్ధి చేయదలిచిన కార్యక్రమాల వివరాలను అందించాలని, ఇంకా ఆ గ్రామంలో ఇతర మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధుల ద్వారా జిల్లా యంత్రాంగం కూడా ఆ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చి దిద్దడంలో మద్దతుగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లో టాయిలెట్స్, ఆర్.ఓ ప్లాంట్స్ ఏర్పాటు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, గ్రీన్ విలేజ్ గా తీర్చిదిద్దడం, విలేజ్ ఇన్ఫ్రా ట్రక్చర్ అభివృద్ధిలోనూ, మెడికల్ సదుపాయాల కల్పనలోనూ భాగస్వామ్యులు కావొచ్చన్నారు. దీంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం కూడా చేసిందని, దీనికి పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలన్నారు. ఏ ఏ పరిశ్రమలో ఏ ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి..? వాటికి ఎలాంటి శిక్షణ పొందిన యువత అవసరం..? వంటి వివరాలు జిల్లా అధికారులకు అందిస్తే.., నిరుద్యోగ యువతను గుర్తించి వారికి శిక్షణ ఇస్తామని.., వారికి ఇంటర్య్వూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి ఎంపిక చేసుకోవచ్చన్నారు. పరిశ్రమల యజమానులే శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా.., నిరుద్యోగ యువత వివరాలు వారికి అందిస్తామని తెలిపారు. జిల్లాలో 68 శాతం మాత్రమే అక్షరాస్యత ఉందని, అందువల్ల వయోజన విద్య విషయంలో కూడా పరిశ్రమలు భాగస్వామ్యులు కావాలన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి.. చుట్టు పక్కల గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుని.., రాష్ట్రంలో జిల్లాను అత్యున్నత స్థానంలో నిలపాలన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పరిశ్రమల యజమానులు ఎంపిక చేసిన గ్రామాల పేర్లు, ఆ గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను డి.పి.ఓ అందిస్తారని, పరిశ్రమల శాఖ జి.ఎంతో కో-ఆర్డినేట్ చేసుకుని వాటిని మోడల్ విలేజ్ గా తీర్చి దిద్దాలని కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి మాట్లాడుతూ.., ప్రస్తుతం 20 వెనుక బడిన గ్రామాలను ఎంపిక చేశామని, డిసెంబర్ 31వ తేదీ లోపు మిగిలిన జిల్లాలోని అన్ని గ్రామాల స్థితిగతులను, వెనుకబాటు తనాన్ని పరిశీలించి మిగిలిన 120 గ్రామాలను కూడా ఎంపిక చేసి.., పరిశ్రమల శాఖ జి.ఎం. ద్వారా అందిస్తామని తెలిపారు. ప్రధానంగా శానిటైజేషన్, మెడికల్ విభాగం, గ్రామాభివృద్ధిలో సి.ఎస్.ఆర్ ద్వారా.., సంస్థ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చేపట్టామని, దానిలో భాగంగా డస్టు బిన్స్, మొక్కల పెంపకం, డ్రైనేజ్ సిస్టం అభివృద్ధి, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధి, పి.హెచ్.సి ల్లో మెడికల్ పరికరాల కల్పనలోనూ, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు, ఆట స్థలాల అభివృద్ధి, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కోచ్ ల ద్వారా మెరుగైన శిక్షణ అందించడం, పశువుల వసతి గృహాలు, గ్రంథాలయాల నిర్మాణం, ఆర్.ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, చెత్త తరలించడానికి ఈ-ఆటోస్, ట్రై సైకిల్స్ పంపిణీతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయి.., మోడల్ విలేజ్ లుగా తయారు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేయాలని డి.పి.ఓ. కోరారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు శిక్షణ అందించడంలోనూ, ఆధునిక వ్యవసాయ పద్దతుల్లో అవగాహన కల్పించడంలోనూ భాగస్వామ్యులు కూడా కావొచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DIC జి.ఎం. శ్రీ ప్రసాద్, పరిశ్రమల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment