కోవిడ్ 19 బారిన పడి చనిపోయిన జర్నలిస్టులను కూడా కరోనా వారియర్లుగా గుర్తించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కోరింది. ఈ మేరకు పీసీఐ కేంద్రానికి లేఖ రాసింది. డాక్టర్లను, ఇతర సిబ్బందిని కోవిడ్ వారియర్లుగా ఎలా గుర్తిస్తున్నారో అలాగే జర్నలిస్టులను గుర్తించాలని పీసీఐ లేఖలో కోరింది.
జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని కోరుతూ పీసీఐ కార్యదర్శి అనుపమ భట్నాగర్ కేంద్ర సమాచార, ప్రసార శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు పీసీఐ ఓ తీర్మానం చేసింది. హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా గుర్తించి వారికి ఇతరులకు అందిస్తున్న బెనిఫిట్స్ ను వర్తింపజేస్తుందని పీసీఐ తెలిపింది. కనుక కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని పీసీఐ కోరింది.
కాగా కరోనా నేపథ్యంలో చనిపోయిన ఇద్దరు డాక్టర్ల కుటుంబాలకు కేంద్రం ఇటీవలే రూ.50 లక్షల నష్ట పరిహారం అందజేసింది. సరిగ్గా అలాంటి ప్రయోజనాలనే జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని పీసీఐ కోరింది. ఇక ఈ విషయమై పీసీఐతోపాటు జర్నలిస్టు యూనియన్, ఇండియన్ న్యూస్ కెమెరామన్ అసోసియేషన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రధాని మోదీకి మెమొరాండం కూడా సమర్పించాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఇదే విషయంపై సానుకూల వైఖరిని కనబరిచారు. మరి కేంద్రం జర్నలిస్టుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Post a Comment