దగదర్తి విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పర్యటించారు. దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల పురోగతిపై కావలి ఆర్.డి.ఓ ని అడిగి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎయిర్ పోర్టు కోసం సేకరించిన భూములను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్.., ఎయిర్ పోర్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని కోర్టు వివాదాలు, చిన్నచిన్న సమస్యలు తప్ప ఎయిర్ పోర్టు భూసేకరణ దాదాపు పూర్తైందన్నారు. జిల్లాలో పోర్టు, రైల్వే లైన్ అందుబాటులో ఉందని, ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయితే.., పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, నిరుద్యోగ యవతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లు నిరుద్యోగ యువతకు పి.ఎం.కె.వి.వై, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ద్వారా శిక్షణ అందించడానికి 14 శాఖల అధికారులతో డిస్ట్రిక్ లెవల్ స్కిల్ కమిటీని ఏర్పాటు చేశామని.., నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి జాబ్ మేళాలు నిర్వహించడానికి ఏడాది క్యాలెండర్ కూడా తయారుచేస్తున్నామన్నారు. జిల్లాలోని ఎ.పి.ఐ.ఐ.సి పారిశ్రామిక వాడల్లోని ఆరు నెలల్లో 112 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, దీనిద్వారా సుమారు 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐదు రెవెన్యూ డివిజన్లలోనూ స్కిల్ డెవలప్ మెంట్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఓ టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని.. ఆ నంబర్ ని ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగ అవకాశాలు, సలహాల కోసం ఈ టోల్ ఫ్రీ నంబర్ ని విద్యార్థులు, నిరుద్యోగులు సంప్రదించవచ్చన్నారు.
ఈ పర్యటనలో కావలి ఆర్.డి.ఓ జి.శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
Post a Comment