ముంపు ప్రాంతాల ప్రజలకు మంత్రి మేకపాటి భరోసా**జలమయమైన గ్రామాలు, నీటిలో మునిగిన రహదారులలో పర్యటన*



*ముంపు ప్రాంతాల ప్రజలకు మంత్రి మేకపాటి భరోసా*

*జలమయమైన గ్రామాలు, నీటిలో మునిగిన రహదారులలో పర్యటన*

*హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ*

*ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలోని ముంపు గ్రామాలు, నిండిన చెరువులను పరిశీలన*

*పడవ నడిపి, జేసీబీ ఎక్కి మరీ వెళ్లి ప్రజల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం*

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నవంబర్, 28; వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో నీట మునిగిన ఆత్మకూరు నియోజకవర్గ ముంపు గ్రామాలలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు.  ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో జలమయమైన రోడ్లు, నీటమునిగిన గ్రామాలు, పూర్తిగా నిండిన చెరువులను పరిసర ప్రాంతాల ప్రజల ప్రస్తుత పరిస్థితులను ప్రత్యక్ష్యంగా ఆయన పరిశీలించారు. 

*చేజర్ల మండలంలోని నాగులవెల్లటూరు చెరువు పరిశీలన*

మంత్రి మేకపాటి ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా తొలుత చేజర్ల మండలంలోని నాగులవెల్లటూరు గ్రామంలోని గండిపడిన చెరువు స్థితిని ఆర్డీవో సహా ఇరిగేషన్, రెవెన్యూ, అధికారులను వెంటబెట్టుకుని పరిశీలించారు. చెరువుకు పడిన గండి పడింది వర్షం, వరదల కారణంగా కాదని, మరమ్మతుల నిర్వహణ లోపం వల్లే జరిగిందని స్థానిక రైతులు మంత్రి మేకపాటికి వివరించారు. భవిష్యత్ లో ఇలా జరగకుండా చెరువుకు శాశ్వత పరిష్కారం చూపేలా మరమ్మతులు చేపట్టాలని అధికారులను మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. బిల్లుపాడు, కాలాయపాలెం గ్రామాల్లో నీటమునిగిన పంట పొలాల వివరాలను సత్వరమే అంచనా వేసి నివేదిక తయారు చేయాలన్నారు. రోడ్ల మీద నడుస్తూ ప్రజలకు వర్షం కారణంగా ఎదురైన ఇబ్బందులపై మంత్రి ఆరా తీశారు.

*ఆత్మకూరు అప్నపారావు పాలెం వద్ద పెన్నా ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి*

మహోగ్రరూపంలో ప్రవహిస్తోన్న పెన్నానది స్వరూపాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు మండలంలోని అప్పారావు పాలెం వద్ద పరిశీలించారు. మంత్రి వస్తున్నారన్న సమాచారంతో తరలివచ్చిన  గ్రామ ప్రజలను మంత్రి పరామర్శించారు. డిసెంబర్ 25న ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల పట్టాలతోపాటే అక్కడి ప్రజలకు కూడా  ఇళ్ల పట్టాలిస్తామని మంత్రి తెలిపారు.  1995 తర్వాత అంతటి వరద రావడం ఇపుడేనని మంత్రి పేర్కొన్నారు. ఈ తరం చూడని పెన్నా ప్రవాహమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత వరద, వర్షం సమస్య సమసిపోతే నెల్లూరు జిల్లా ఇక సస్యశ్యామలవనుందన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రవాహం వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

*పడవ నడుపుతూ సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామానికి వెళ్లిన మంత్రి గౌతమ్ రెడ్డి*

సంగం మండలంలో భారీ వర్షాల కారణంగా పూర్తిగా నీట మునిగిన వీర్లగుడిపాడు గ్రామానికి మంత్రి మేకపాటి పడవలో వెళ్లి పరామర్శించారు. త్వరలోనే వీర్లగుడిపాడు ప్రజలకు ఇలాంటి వర్షాల నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందులు రానివిధంగా బ్రిడ్జి కట్టిస్తానని హామీ ఇచ్చారు. పడవలో మినహా రావడానికి ఆస్కారం లేని వీర్లగుడిపాడు గ్రామ ప్రజలను చూసి మంత్రి చలించిపోయారు. బ్రిడ్జి నిర్మాణం ఏ విధంగా చేపడితే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆయన అన్నివైపులా పరికించి పర్యవేక్షించారు. స్వయంగా మంత్రే తెడ్డుతో పడవ నడుపుతూ తమ కోసం వస్తున్నాడని తెలిసి ఒడ్డునే జనం బారులు తీరారు. ఇంత వరద, వర్షం ఉన్నపుడు అందరూ సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళుతుంటే మీరెందుకిలా ఇక్కడే ఉండి ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అడిగారు. కనీసం ఒక వారం రోజులైనా సదుపాయాలున్న చోట ఉండవచ్చు కదా అంటూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. గ్రామంలో ఎంత మంది ఉన్నారు, వారి భోజన, నీటి వసతుల గురించి ఆర్డీవోను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 100 మందికి పైగా మాత్రమే ఉన్నారని మిగతా అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చామని ఆర్డీవో సువర్ణమ్మ మంత్రికి వివరించారు. వీధులన్నీ కలియతిరుగుతూ వీర్లగుడిపాడు ప్రజల యోగక్షేమాలపై ఆరా తీశారు. తాతల కాలం నుంచి మాకు వర్షాలు, వరదాలు మామూలే సారూ అంటూ మంత్రికి స్థానిక ప్రజలు బదులిచ్చారు.


*ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన అధికార యంత్రాంగానికి అభినందనలు:  మంత్రి గౌతమ్ రెడ్డి*

తీవ్రంగా వర్షాలు కురిసినా..వరద పోటెత్తినా ప్రాణ నష్టం లేకుండా కృషి చేసిన అధికార యంత్రాంగాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు.  ఆత్మకూరు మోడల్ ఎస్టీ కాలనీలో ప్రస్తుత పరిస్థితిని మంత్రి మేకపాటి ప్రత్యక్ష్యంగా సమీక్షించారు.  తుపాన్ ప్రభావం వలన ఇబ్బందులు పడిన గిరిజనులతో ఆయన మాట్లాడారు. అనంతరం వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆత్మకూరులోని వెంకట్రావు పల్లి వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ చిన్నారులకు దుప్పట్లు పంచారు. నివర్ తుపాన్ జాతీయ విపత్తు కావడం వలన తొందరగా కేంద్రం నుంచి నష్టపరిహారం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర బృందాలు వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ జరిగిన నష్టాలను అంచనా వేస్తున్నారని మంత్రి మీడియాకు వివరించారు. తీవ్రగాలులు, కుండపోత వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ అంతరాయం కలగడం వలన ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి పేర్కొన్నారు. గత నెలలో కురిసిన వర్షం వేరని, ప్రస్తుత నివర్ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని మంత్రి తెలిపారు. సోమశిల జలాశయానికి  ఏర్పడిన విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కలువాయి గ్రిడ్ కు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రత్యేక చర్యలకు ప్రయత్నిస్తామన్నారు. సోమశిల ఎడమ కాలువ పొర్లు కట్ట గురించి మాట్లాడుతూ ఉత్తర, దక్షిణ కాలువలను విస్తరించేందుకు కేబినెట్ లో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతికతో కూడిన అత్యాధునిక చర్యలు చేపట్టి భవిష్యత్ లో ఇబ్బంది రాకుండా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు.

*వానలు, వరదలు లెక్కచేయకుండా కచ్చిరిదేవరాయపల్లి, వెంగమనాయుడుపల్లిలో పర్యటించిన మొదటి నాయకుడు మీరే : అనంతసాగరం గ్రామాల ప్రజలు*

పెన్నా పరివాహక ప్రాంతమైన అనంతసాగరం మండలంలో నీటమునిగిన కచ్చిరిదేవరాయపల్లి, వెంగమనాయుడుపల్లి గ్రామాలలో మంత్రి మేకపాటి పర్యటించారు. కచ్చిరిదేవరాయపల్లి గ్రామాలను పరామర్శించేందుకు వెళ్లడానికి రహదారులు సరిగా లేకపోవడంతో ఆయన జేసీబీలో ప్రయాణం చేసి మరీ వెళ్లారు. కొన్ని వీధులలో సుడిగాలి పర్యటన చేశారు. గండ్లు, పొర్లుకట్టల పరిస్థితిపై  తద్వారా జరిగిన పంటనష్టం వివరాలపై మంత్రి ఆరా తీశారు.  కొమ్మలేరు వాగు గుండా దారి మొత్తం గోదారిగా మారిన నీటిలో మంత్రి ప్రయాణించారు. అందరినీ పలకరించి, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని స్థానిక ప్రజలకు భరోసా నింపారు. పూర్తిగా దెబ్బతిన్న రహదారులను త్వరలోనే కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు మంత్రి మేకపాటి. కచ్చిరిదేవరాయపల్లి, వెంగమనాయుడు పల్లి గ్రామాల సమస్యను ప్రత్యేకంగా పరిగణించి అందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో తమ గ్రామానికి గతంలో ఇలా ఎవరూ రాలేదని మంత్రిగారే మొదటిసారని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాల కృషిని ప్రశంసిస్తూ స్థానికులు మంత్రికి వివరించారు. 

*అనంతసాగరం చెరువు పరిశీలన, వరికుంటపాడు కరెంట్ కష్టాలకు చెక్*

అనంతసాగరం మండలంలోని అనంతసాగరం చెరువును మంత్రి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. పంటలు మునగకుండా, జనం ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టేందుకు గల మార్గాలపై ఆయన అధికారులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు.  వరికుంటపాడుకు కరెంట్ కష్టాలపై సమీక్షించిన మంత్రి మేకపాటి త్వరలోనే అక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారిస్తామన్నారు. అనంతరం మర్రిపాడులోని సన్నువారిపల్లిగ్రామం వద్ద బొగ్గేరు సమీపంలో కాజ్ వే పరిశీలనకు మంత్రి బయలుదేరారు. ఆదివారం ఆత్మకూరు నియోజకవర్గంలోని మిగిలిన రెండు మండలాలు అనుమసముద్రం పేట, సంగం మండలాలలో పర్యటించే అవకాశం ఉందని మంత్రి కార్యాలయం తెలిపింది.

---------------------------

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget