విజయవాడ వైసీపీలో రచ్చ జరుగుతోంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, స్థానిక వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. నాటి నుంచి నేటి వరకూ వైసీపీ నేతలు, వంశీ మధ్య రెండ్రోజులకోసారైనా వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మీడియా మీట్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అందర్నీ కలుపుకునే వెళ్లే శక్తి తనకుందని వంశీ చెప్పగా.. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా మరోసారి వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. వల్లభనేని-దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహాబాహీకి దిగారు. దీంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు తెలిసింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చినికి చినికి గాలి వానగా మారుతున్న ఈ ఘటనలను వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది?, జిల్లా మంత్రులు, ఇన్ చార్జిలు ఎలా సర్దిచెబుతారో చూడాలి.గన్నవరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ తరఫన గెలిచారు వల్లభనేని వంశీ. అయితే, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇబ్బంది పెట్టారనేది గన్నవరం నియోజకవర్గ వైసీపీ నేతల వాదన. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చక్రం తప్పి వంశీని వైసీపీ గూటికి చేర్చారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆయన వైసీపీకే మద్దతిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించారు. ఈ అంశం వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు మింగుడు పడడం లేదనే వాదన ఉంది. అయితే, ఆయన్ను శాంతింపజేసేందుకు పార్టీ నేతలు యార్లగడ్డకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గంలో వాతావరణం కొంత శాంతించిందనే అనుకున్నారు. అయితే, యార్లగడ్డ సైలెంట్‌గా ఉన్నా దుట్టా రామచంద్రరావు వర్గం ఇప్పుడు వంశీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇవన్నీ నియోజకవర్గంలో పట్టుకోసం జరుగుతున్న ప్రయత్నాలేననే వాదన ఉంది.2019లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ టీడీపీని వీడారు. ఇక రేపో మాపో గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడతారంటూ వార్తలు వస్తున్నాయి. వైసీపీలోని 23 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా వైసీపీలోకి చేర్చుకుని ఆ తర్వాత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనే ప్లాన్‌లో వైసీపీ ఉన్నట్టు కనిపిస్తోంది.
Post a Comment