రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వినియోగదారులకు మేలు చేసేవిధంగా ఉల్లి ధరలను నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉల్లిని మార్కెట్లోకి తీసుకువచ్చి రైతుబజార్లు ద్వారా విక్రయించడం జరుగుతుందని తెలిపారు. తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. భారీ వర్షాల వల్ల కర్నూలు ఇతర ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఈసారి 25 వేల హెక్టార్లలో సాగు చేసినట్లు తెలిపారు. అధిక వర్షాలు, వరదల కారణంగా 2,600 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని గుర్తించామన్నారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో 12 వేల క్వింటాళ్లు కర్నూలు ఇతర మార్కెట్లకు వచ్చేదని కానీ ఇప్పుడు 1500 నుంచి 2000 క్వింటాళ్లు మాత్రమే మార్కెట్‌కు వస్తుందన్నారు. మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా వరదల వల్ల పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని అన్నారు. రేపటి నుంచి ఉల్లి విక్రయాలు ప్రారంభమవుతాయని, తొలిదశలో ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని రైతుబజార్ల ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, క్రమంగా అన్ని ప్రాంతాల రైతుబజార్లలో విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
Post a Comment