* జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పెంచలయ్య
చిత్తూరు : కరోనా పాజిటివ్ వ్వక్తి ఆరోగ్య పరిస్థితిని సరిగ్గా తెలుకొని వారికి వీలైనంత త్వరగ సరైన వైద్య సేవలు అందించడం ద్వారానే మరణాలను తగ్గించగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పెంచలయ్య చెప్పారు. కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై నగరపాలక సంస్థ వార్డు కార్యదర్శులకు శుక్రవారం సాయంత్రం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ... పాజిటివ్ గా తేలిన వ్యక్తికి సంబంధించి సమాచారం అందిన వెంటనే ఏఎన్ఎం, ఆరోగ్య కార్యదర్శులు, వాలంటీర్ ఎదరు వ్యక్తి యొక్క ఊపిరి తీసుకునే సామర్థ్యం, స్థాయిలను పరీక్షించాలన్నారు. నిమిషానికి 24 సార్లు కంటే ఎక్కువగా ఊపిరి తీసుకుంటున్నా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నా, ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువ ఉంటే.. సదరు వ్యక్తిని అత్యవసరంగా తిరుపతి లోని సిమ్స్ కోవిడ్ ఆసుపత్రికి పంపాలన్నారు. పాజిటివ్ వ్యక్తికి ఇతర జబ్బులు ఉండి మందులు వాడుతుంటే వారిని ట్రయేజ్ సెంటర్ కి పంపి ఇతర పరీక్షలు నిర్వహించి కోవిడ్ కేర్ సెంటర్ కి పంపాలన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కచ్చితంగా మూడు నియమాలు పాటించాలన్నారు. విధిగా మాస్కులు ధరించడం , భౌతిక దూరం పాటించడం, క్రమంతప్పకుండా శానిటైజర్, సబ్బుతో చేతులు కడుక్కోవడం ద్వారా వైరస్ రాకుండా చాలా వరకు నియంత్రించవచ్చన్నారు. నగర కమిషనర్ పి.విశ్వనాథ్ మాట్లాడుతూ... పాజిటివ్ వ్యక్తులు సరైన వైద్య సేవలు పొందాలంటే క్షేత్రస్థాయిలో కార్యదర్శులు వారికి సరైన అవగాహన కల్పించి, వారి ఆరోగ్య స్థితిని తెలుసుకొని సరైన ఆసుపత్రులకు పంపాలన్నారు.
Post a Comment