చిత్తూరు: జిల్లాలోని రెండు గ్రామాల మధ్య వాలీబాల్ ఆట చిచ్చురేపింది. వాలీబాల్ ఆట కారణంగా రెండు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో ఇరుపక్షాలకు చెందిన ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఎస్ఆర్ పురం మండలంలోని పొదలపల్లి, వెంకటాపురం గ్రామాల మధ్య వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పొదలపల్లి గ్రామస్తులపై వెంకటాపురం గ్రామస్తులు ఆరుసార్లు గెలిచారు. ఈ క్రమంలో ఇరు గ్రామాలకు చెందిన యువకుల మధ్య వివాదం నెలకొంది.
ఈ వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఏడుగురు గాయాలపాలయ్యారు.
ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment