రోగులను కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు చేస్తోన్న ప్రయోగాలు ఇప్పుడిప్పుడే విజయం సాధిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభన ఎక్కువగా ఉన్న బ్రిటన్‌లో కరోనా రోగులకు సాధారణంగా అందుబాటులో ఉండే ‘స్టెరాయిడ్’ మందునిచ్చి మంచి ఫలితాలను సాధించినట్లు బ్రిటన్ వైద్యులు తెలియజేస్తున్నారు. ‘డెక్సామెథాసోన్’ అనే స్టెరాయిడ్‌ను ఇవ్వడం వల్ల వెంటిలేటర్లపై ఉన్న కరోనా రోగుల్లో మూడొంతుల మంది, ఆక్సిజన్ అవసరం రోగుల్లో ఐదొంతుల మంది కోలుకున్నారని ఈ చికిత్సకు నేతృత్వం వహిస్తోన్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే తెలిపారు.
ఇంతకుముందే ఈ చికిత్సను ప్రారంభించి ఉన్నట్లయితే నాలుగువేల నుంచి ఐదు వేల మందిని ప్రాణాలు పోకుండా కాపాడి ఉండేవాళ్లమని ఆయన మీడియాతో చెప్పారు. ఈ స్టెరాయిడ్ చికిత్సకు అతి తక్కువ ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. ఎన్‌హెచ్‌ఎస్‌లో ఈ కోర్స్‌కు ఐదు పౌండ్లు ఖర్చయితే, భారత్ లాంటి ఇతర దేశాల్లో ఓ డాలర్ లోపే ఖర్చు కావచ్చని ఆయన అన్నారు. 2,104 మంది కరోనా రోగులకు డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్‌ను రోజుకు నోటి ద్వారా 6 ఎమ్‌జీ లేదా నరాలకు ఇంజెక్షన్ ద్వారా పది రోజుల పాటు ఇవ్వడంతో చాలా మంచి ఫలితాలను సాధించామని ప్రయోగాత్మక చికిత్స విధానంలో పాల్గొంటున్న డాక్టర్ పీటర్ హార్బీ తెలిపారు. ఇప్పటి వరకు ఏ ఔషధం ఇవ్వలేనంత ప్రయోజనం ఈ మందు ద్వారా లభించిందని ఆయన చెప్పారు.
Post a Comment