మద్యం ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారన్నారు సీఎం. ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం, ఇసుక అక్రమ రవాణా ఆగిపోవాలని తేల్చి చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్ మెంట్, ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తాయో... అదే తీరులో స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) పనిచేయాలన్నారు. మద్యం అక్రమ తయారీ, మద్యం, ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకోవాల్సిందే అన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు స్వతంత్ర వ్యవస్థకు తుదిరూపు ఇచ్చారు.
మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల కారణంగా పొరుగు రాష్ట్రాలనుంచి అక్రమంగా మద్యం రవాణా చేయడానికి.. అలాగే అక్రమంగా మద్యాన్ని తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయన్నారు సీఎం.
గతంలో ఎక్సైజ్ కమిషనర్ కింద డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్టు ఉండేది. తాజాగా ఎక్సైజ్ కమిషనర్ కింద ఉన్న డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్టు స్థానంలో స్వతంత్రంగా పనిచేసే కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) పోస్టు వస్తుంది. ఇది డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. ఎక్సైజ్ విభాగంలో ఉన్న సిబ్బందిలో కొద్దిమంది ఎక్సైజ్ కమిషనర్ విభాగం కిందకు వస్తారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున లైసెన్స్‌లు, స్టాకు, విక్రయాలు, ప్రొడక్షన్ లాంటి రోజువారీ పాలనా అంశాలను మాత్రమే ఎక్సైజ్ కమిషనర్ చూసుకుంటారు.
ఎక్సైజ్ విభాగంలో మిగిలిన సీఐలు, ఎస్సైలు, మిగిలిన సిబ్బంది అంతా కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్)కిందకు వస్తారు. మద్యం అక్రమ తయారీ, రవాణాలను అడ్డుకోవడం వీరి ప్రధాన విధి. అలాగే ఇసుక అక్రమాలను కూడా నిరోధించడం వీరి విధుల కిందకే వస్తుంది. కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కింద జిల్లాల్లో ఏఎస్పీలు కూడా పనిచేస్తారు. ఒక్కో ఏఎస్పీ కింద కనీసం 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీలతో వీరు సమన్వయం చేసుకుంటారు. అక్రమ రవాణాకు ఆస్కారం ఎక్కువగా ఉన్న సరిహద్దు జిల్లాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కోసం ఐపీఎస్ స్థాయి అధికారులు ఉంటారు. వీరంతా కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) రిపోర్టు చేస్తారు. ఈ సిబ్బందికి మెరుగైన మౌలిక సదుపాయాలు, వాహనాలు కల్పించి గట్టిగా పనిచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిబంధనల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.
Post a Comment