- కమిషనర్ పివివిస్ మూర్తి
ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తి విధానాలపై అవగాహన పెరిగితేనే వ్యాధి నివారణ సాధ్యమవుతుందని, నివారణకు నగర వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పివివిస్ మూర్తి సూచించారు. నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆదిత్య నగర్ చిల్డ్రన్స్ పార్కులో వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, ఏ.ఎన్.ఎమ్. వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లకు ఇంటింటికి సర్వే కార్యక్రమంపై అవగాహనా సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు ఆరోగ్య శాఖ సిబ్బంది కొన్ని బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి విచారిస్తారని, ఇటీవల విదేశాలనుంచి వచ్చిన బాధితులను ప్రత్యేకంగా గుర్తిస్తారని తెలిపారు. వైరస్ లక్షణాలను కుటుంబ సభ్యులకు వివరించి, బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు. కరోనా బాధితులను 14 రోజుల పాటు ప్రత్యేక వైద్య సేవలు అందించి స్వస్థత చేకూరేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసారు. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన ప్రాధమిక జాగ్రత్తలు పాటిస్తూ, జన సమీకరణ జరిగే వేడుకలు, సభలు, వివిధ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కమిషనర్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ప్రత్యేక ద్రావకం పిచికారీ చర్యలు చేపట్టామని, అపరిచితులతో కరచాలనం చేయడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగడం వంటి చర్యలు మానుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రసాద్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment