ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం పై ప్రభుత్వం సుప్రీం కోర్టు లో పిటిషన్ వేయడం.... అందుకు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పై తెలుగుదేశం వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషనర్ ని గవర్నర్ నియమిస్తాడన్న విషయం కూడా తెలియని వ్యక్తి సీఎం గా ఉండటం మన దౌర్భాగ్యమని ఆయన అన్నారు.రాష్ట్రమంతా మారణకాండ జరిగిందని, ప్రశాంతమైన ప్రాంతాలను వల్లకాడు చేసి, కిడ్నాప్ లు, బెదిరింపులతో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్న విధానంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని, అది గమనించిన జగన్మోహన్ రెడ్డి బలవంతంగా అయినా సరే ఎన్నికల్లో ఎవరూ నిలబడకుండా ఉండేలా చేయాలని, తన పార్టీ నాయకులను ఉసిగొల్పి నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో ఇంత రౌడీయిజం, దుర్మార్గాలు జరగుతాయని కలలో కూడా ఊహించలేదని అన్నారు. పోలీసులను అడ్డుగా పెట్టుకుని చెలరేగిపోతున్నారని వాపోయారు. కలెక్టర్ల మాట వినే తహసీల్దార్లు, అధికారుల మాట వినేనాధుడే కారువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల రద్దు అంశాన్ని పరిశీలిస్తున్నామనడం, పలువురు ఎస్పీలు, కలెక్టర్లు, డీఎస్పీలు, సీఐలపై చర్యలకు సిఫారసు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. అందరూ వైకాపా నేతలు చెప్పినట్టు వింటుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఇన్ని అరాచకాలు సృష్టించడం సరికాదన్నారు.
Post a Comment