ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతలా దిగజారిపోయి ప్రవర్తించడం రాష్ట్రానికే మంచిది కాదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల వాయిదాపై జగన్ విరుచుకుపడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో అలహాబాద్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీకి ఉండే అధికారాలే.. స్థానిక ఎన్నికల విషయంలో కూడా అంతే అధికారాలు ఉంటాయని కోర్టు తీర్పును వెల్లడించారు. బెంగాల్‌లో వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని.. సాక్షాత్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష పార్టీలన్నీ కోరాయన్నారు. ఎన్నికల కమిషన్ ను జగన్, విజయసాయిరెడ్డి ప్రశ్నించడం.. కులాలు అంటగట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని ఆరు వారాల పాటు ఎన్నికల కమిషన్ వాయిదా వేసినంత మాత్రాన ఏం కొంపలు మునిగిపోయాయని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ అధికారులను ఎలా బదిలీ చేస్తుందని గగ్గోలు పెడుతున్నారని, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎస్ పునేఠాను, ఇంటిలెజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినప్పుడు ఏం చేస్తున్నారన్నారు. డీజీపీ ఠాకూర్ ను ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి తప్పించారు. శ్రీకాకుళం, కడప ఎస్పీలను మార్చేశారు.. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేశారు... అప్పుడెందుకు మాట్లాడలేదని సోమిరెడ్డి అన్నారు. నామినేషన్లు, ఉపసంహరణలు మొత్తం అయిపోయాయి... ఎన్నికల తేదీ మాత్రమే వాయిదా పడింది... అంత మాత్రానికి ప్రస్టేషన్ ఎందుకని ముఖ్యమంత్రిపై ఘాటుగా స్పందించారు.
Post a Comment