నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఉగాది కి ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎం.వి. శేషగిరి బాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల సంఘాల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. అనంతరం వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శేషగిరి బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జర్నలిస్టులతో కాసేపు ముచ్చటించారు. జిల్లాలో ఎంత మంది జర్నలిస్టులు ఉన్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు నగర పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం మూడు ప్రాంతాలను ప్రతిపాదించారు. నగర పరిధిలో స్థల సేకరణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. కొత్తూరు, కనుపర్తిపాడు, గొలగమూడి ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మూడు ప్రాంతాల్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. జర్నలిస్టుల సంఘాల తరపున కొందరు శనివారం ఉదయం నెల్లూరు ఆర్డీఓను కలవాలని సూచించారు. మూడు ప్రాంతాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసి ఆర్డీఓ చే ప్రతిపాదనలు తనకు పంపాలని సూచించారు. ప్రతిపాదనల అనంతరం అర్హుల జాబితాను నెల్లూరు సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా సిద్దం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపడుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Post a Comment