శ్రీసిటీని సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

- ఆధునికత, ఆధ్యాత్మికత కలగలసిన ప్రాంతం శ్రీసిటీ అన్న శంకరాచార్య   

శ్రీసిటీ, ఫిబ్రవరి 18, 2020:

ఆధ్యాత్మిక గురువు కంచి కామకోటి పీఠం పీఠాధిపతి ఆచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి దీవెనలు పొందడం ద్వారా  శ్రీసిటీ, ఇతర పరిసర ప్రాంత ప్రజలకు సోమవారం (ఫిబ్రవరి 17) ఒక అద్భుతమైన రోజుగా మిగిలింది. రాత్రి 9 గంటల సమయంలో శ్రీసిటీ విజిటర్స్ సెంటర్‌కు చేరుకున్న శ్రీ శంకరాచార్యులకు వేద పఠనాల మధ్య వేద పండితులతో కలసి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాంప్రదాయ స్వాగతం పలికారు. స్థానిక బిజినెస్ సెంటర్లో ఆయనకు శ్రీసిటీ పుట్టుక, ప్రస్థానం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

అనంతరం కమ్యూనిటీ హాల్ వద్ద భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆధునికత, ఆధ్యాత్మికత సమపాళ్లలో కలగలసి అభివృద్ధి చెందుతున్న ప్రత్యేక ప్రాంతంగా శ్రీసిటీని అభివర్ణించారు. 50 వేల మందికి ఇక్కడ ఉపాధి లభించినందుకు తాను సంతోషిస్తున్నానని, భవిష్యత్తులో ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కృషి, పట్టుదల ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయని పేర్కొన్న ఆయన, శ్రీసిటీ విషయంలో అది రుజువైందన్నారు. ఆధునికత, కృషి, చిత్తశుద్ధి ప్రమాణాలుగా వీరు చేపడుతున్న చర్యల వలన ఇక్కడ మంచి శ్రేయస్సు, అభివృద్ధి, ప్రజలకు కావలసిన మేరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. వీరి ప్రయత్నాలు మరింత ఫలించి ఈ ప్రాంతానికి మంచి శ్రేయస్సును, శాంతిని కలుగచేయాలని ఆయన దీవించారు.   

ధర్మం, ఐక్యమత్యం, శాంతి, ప్రేమ గల దేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుందన్న స్వామీజీ, మన సంస్కృతి కష్టపడి పనిచేయడం, ఇతరుల పట్ల దయ చూపడం మరియు చట్టబద్ధమైన జీవితాన్ని గడపడం నేర్పుతుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ప్రత్యేకమైన బలం అన్నారు. వివిధ భాషలు, సంస్కృతులు చాలా కాలం నుండి ఇక్కడ సామరస్యంతో కలిసి ఉన్నాయని పేర్కొన్నారు. మనం సహనానికి చిరునామా అన్నారు. ఒక విధంగా, మనలో కరుణ, సహనం, సర్దుబాటు, ఇతరులకు సహాయం చేయడం వంటి లక్షణాలను అభివృద్ధి చేయడానికి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్తే కారణమన్నారు. మన దేశం యొక్క గత వైభవాన్ని తిరిగి పొందడానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

శంకరాచార్యుల సందర్శన పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, స్వామీజీ శ్రీసిటీకి రావడం తాము అత్యంత గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. శంకరాచార్యుల వారు అపర శివావతారమని  మన నమ్మకం. పరమశివునికి ప్రియమైన రోజుగా భావించే సోమవారం నాడు  స్వామిజీ శ్రీసిటీకి విచ్చేయడం శుభసూచకంగా భావిస్తున్నామని అన్నారు. ఆయన సందర్శన, దర్శనం, దైవిక ఆశీర్వాదాలు తమకు ఆధ్యాత్మిక బలాన్ని, ఆనందాన్ని, శాంతిని కలుగచేస్తాయన్నారు. శ్రీసిటీని సందర్శించిన మొట్టమొదటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యులు కాగా, వారికి హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.

అంతకు మునుపు, శంకరాచార్యులు శ్రీసిటీ పర్యటనలో భాగంగా శంకర నేత్రాలయ కంటి ఆసుపత్రి, కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ శ్రీసిటీ కమ్యూనిటీకి, పరిసరాల్లోని ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వారు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే క్రీక్ సైడ్  అపార్ట్మెంట్స్ వద్ద కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు.

కాగా, సోమవారం రాత్రి స్వామిజీ, ఆయన శిష్య బృందం శ్రీసిటీలో బసచేసి మంగళవారం ఉదయం చెన్నై బయలుదేరి వెళ్లారు. వీడ్కోలు సమయంలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, మరికొందరు భక్తులు స్వామిజీ ఆశీర్వాదం పొందారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget