నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది. సుమారు 42 లక్షల 80 వేల మంది లబ్దిదారులను ఈ పధకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించగా.. ఇవాళ ఫైనల్ లిస్టును అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఆ తర్వాత లిస్ట్‌ను గ్రామ/ వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. జనవరి 4,5,6,7,8 తేదీల్లో అర్హులైన వారికి అవగాహన కార్యక్రమాలు ఉండగా.. జనవరి 9వ తేదీన చిత్తూరులో వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ఇక అర్థులైనా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.15 వేలు జమ చేయనుంది. ఈ పథకం కోసం రూ.6,455 కోట్లను కేటాయించగా.. ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్కీంకు తెల్ల రేషన్ కార్డు, లబ్దిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థులు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు చదువును మధ్యలో నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.
Post a Comment