ఎముకల గూడుగా మారిన మృగరాజు...పాపం...
సూడాన్ రాజధాని కార్టూమ్‌లోని అల్ ఖురేషి పార్కుకు వెళ్లిన పర్యటకులకు హృదయవిదారకర దృశ్యాలు కనిపించాయి. పార్కులో ఉన్న ఐదు ఆఫ్రికన్ సింహాలు ఆహారం లేక బక్కచిక్కిపోయి ఎముకల గూడును తలపించాయి. మృగరాజులను ఆ పరిస్థితిలో చూడటం పర్యటకులను తీవ్రంగా కలిచి వేసింది. బలిష్టమైన దేహాంతో గాంభీర్యంగా గర్జించే సింహాలు సమయానికి ఆహారం దొరకకపోవడంతో అలా నీరసంగా మారాయి. దీనికి కారణం ఆ దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభమే. దాంతో జూలోని జంతువులకు అందించే ఆహారం, మందులకు కూడా నిధులు ఇవ్వలేకపోతున్నారు. గత కొన్ని వారాలుగా ఇదే పరిస్థితి. దీంతో ఆ పార్కులో ఉన్న ఐదు సింహాలతో పాటు ఇతర జీవుల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని అక్కడి సిబ్బందిప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో తమ సొంత డబ్బులతో వాటికి ఆహారం అందిస్తున్నామని పార్కు మేనేజర్ ఎస్సామెల్డిన్ హజ్జర్ చెప్పారు. ఆర్థిక సంక్షోభం కారణంగా పర్యటకుల రద్దీ కూడా బాగా తగ్గిపోయింది. దీంతో పార్కుకు వచ్చే ఆదాయం పడిపోయిందని ఆయన తెలిపారు. ఆదివారం కొందరు పర్యటకులు పార్కుకు వెళ్లగా సింహాలు అలా నీరసంగా ఒకే చోట కూర్చొని ఉండడం గమనించారు. ఎముకల గూడులా తయారైన మృగరాజు ఫొటోలు తీసిన పర్యటకులు.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక ఈ ఫొటోలు చూసిన కొంతమంది నెటిజన్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మరికొందరు ఆన్‌లైన్ క్యాంపెయిన్ ద్వారా నిధులు సేకరించే పనిలో ఉన్నారు.
Post a Comment