నెల్లూరు, జనవరి 27, (రవికిరణాలు) : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఫిబ్రవరి మాసం నుండి ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై వారం వారీగా షెడ్యూల్ ను కూడా విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు, మార్కెటింగ్ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై అవసరమైన ఎక్యుప్ మెంట్ ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్ లో వరి పంట ఫిబ్రవరి నెల నుండి కోతకు వచ్చే అవకాశం ఉన్నందున, ఏ మండలంలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్న విషయం పై ఫిబ్రవరి మాసం నుండి వారం వారీగాషెడ్యూల్‌ను విడుదల చేసి, అందుకనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై రైతుల్లో అవగాహన కల్పించేలా కరపత్రాలు, వాల్ పోస్టర్స్, బ్యానర్స్ ద్వారా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పౌర సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై పరిశీలించి, పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డి.సి.సి.బి. సి.ఇ.ఓ. కె.వి.రమణా రెడ్డి, డి.ఎస్.ఓ. బాలకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ డి.యం.రోజ్ మాండ్, మార్కెటింగ్ శాఖ ఎడి బి.రావమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment