మా సచివాలయంలో ప్రజలకు సమస్యలు తీర్చాంబర్త్డే వేడుకలు మాత్రమే జరుగును.
కోట మండలం వెంకన్నపాళెం సచివాలయంలో పుట్టినరోజు సంబరాలు..!*
విధులు పక్కన పెట్టి.. వేడుకల్లో ఎంజాయ్..! సచివాలయం ఉద్యోగుల నిర్వాకం.*
గ్రామ సచివాలయాన్ని ఇంటిలా మార్చేసిన కొంతమంది ఉద్యోగులు.*
డ్రెస్ కోడ్ మరిచి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఉద్యోగులు.*
వీఏఏ సుస్మిత కేకు కట్ చేయగా, బర్త్డే రిబ్బన్ స్ప్రే చేసిన డీఏ శ్రీనాథ్.*
చప్పట్లు, కేరింతలు, ఆట పాటలతో దద్దరిల్లిన వెంకన్నపాళెం సచివాలయం.
ఆశ్చర్యపోయిన తోటి సిబ్బంది, ఆగ్రహించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు.*
సేవల కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించుకోని వీఏఏ, డీఏలు.
నిరీక్షించి.. నిరీక్షించి.. ఇళ్లకు వెనుదిరిగిన రైతులు, లబ్దిదారులు, ప్రజలు.*
వీఏఏ, డీఏల బాధ్యతారాహిత్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.*
సాధారణంగా సచివాలయాలకు డుమ్మా కొట్టడం, సమయపాలన పాటించకపోవడం, బయోమెట్రిక్ వేసి ఇంటికి చెక్కేయడం కామన్.. ఆ సచివాలయానికి చెందిన కొంతమంది ఉద్యోగులు మరో అడుగు ముందుకేసారు. సచివాలయాన్ని ఇంటిలా మార్చేసి ఓ ఉద్యోగిని జన్మదిన వేడుకలను ఎటువంటి జంకూ బొంకూ లేకుండా అట్టహాసంగా జరుపుకున్నారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది.
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రజలకు సత్వర సేవలను సకాలంలో జవాబుదారీ తనంతో అందించాలనే బృహత్ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా గతమెన్నడూ లేని విధంగా అమలు చేసారు. అంతటితో ఆగకుండా ప్రతి సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రం, వైయస్ఆర్ క్లినిక్లను సైతం ఏర్పాటు చేసారు. వీటి ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు సకాలంలో అందుతుండడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోలా ఓ చిన్న సర్టిఫికేట్ కోసం రోజుల తరబడి కాళ్ళరిగేలా తిరగాల్సిన అగత్యం లేని రోజులు రావడంతో జగనన్నను వేనోళ్ల కీర్తిస్తున్నారు. పెద్ద మనసుతో ఆశీర్వదిస్తున్నారు.
కాగా, తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాళెం సచివాలయంలోని కొంతమంది ఉద్యోగులు చేసిన ఓ నిర్వాకంతో సచివాలయ వ్యవస్థ ప్రతిష్ట మసక బారింది. ప్రజలకు సేవ చేసి మన్ననలు పొందాల్సిన ఉద్యోగులు దేవాలయం లాంటి సచివాలయాన్ని తమ ప్రైవేటు కార్యక్రమానికి వినియోగించుకొని బ్రష్టుపట్టించారు. తాజాగా జరిగిన ఈ సంఘటనకు సంభందించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యామాల్లో బాగా చక్కర్లు కొట్టాయి.
వివరాల్లోకి వెళితే..
వెంకన్నపాళెం సచివాలయం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సుస్మిత పుట్టినరోజు సంబరాలకు గ్రామ సచివాలయం వేదికగా చేసుకొన్నారు. డిజిటల్ అసిస్టెంట్ శ్రీనాథ్ సచివాలయంలోని ఓ గదిలో పుట్టినరోజు వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసారు. జన్మదిన కేకును వీఏఏ కట్ చేస్తుండగా, డిజిటల్ అసిస్టెంట్ శ్రీనాథ్ గాల్లోకి కాకుండా ఆమె మొహంపైనే బర్త్డే రిబ్బన్ స్ప్రే చేస్తుండగా, చుట్టూ ఉన్న కొంతమంది చప్పట్లు, ఆట పాటలు, కేరింతలతో ఉత్సాహపరుస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సెల్ఫీ వీడియోలు, ఫోటోలు దిగి సరదా సరదాగా గడిపారు. అనంతరం కేకు ముక్కలు, మిఠాయిలను పంపిణీ చేస్తూ నానా హడావుడి చేశారు. మిగిలిన ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమై సేవలందిస్తుండగా, ఇద్దరు ఉద్యోగులూ యూనిఫామ్ (డ్రెస్ కోడ్) లేకుండా వేడుకల్లో హుషారుగా కనిపించారు. కార్యక్రమం ఆసాంతం ఒక్క మహిళా ఉద్యోగి కూడా లేకపోగా, కేవలం మగవాళ్లే పాల్గొనడం గమనార్హం.
మట్టి నమూనాల సేకరణ, కౌలు రైతుల గుర్తింపు, పీఎం కిసాన్ ఈకేవైసీలాంటి పలు కార్యక్రమాలు నిర్థిష్ట గడువులోగా పూర్తి చేయాల్సిన బాధ్యతలు ఉన్నా.. సచివాలయానికి దూరంగా ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. రైతు భరోసా కేంద్రం నుండి సచివాలయానికి చేరుకొని విధులు పక్కన బెట్టి గంటల తరబడి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న వీఏఏ, సహకరించిన డీఏల తీరు పట్ల స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాసేపటికీ రైతు భరోసా కేంద్రం వద్దకు వీఏఏ రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. సచివాలయం డీఏ కియోస్క్ వద్ద డీఏ శ్రీనాథ్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు, లబ్ధిదారులు పడిగాపులు కాసి ఇళ్లకు తిరిగివెళ్ళిపోయారు.
ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయాలు.. ఇలా ఉద్యోగుల జన్మదిన వేడుకలకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ వేడుకల పట్ల తోటి సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేయగా, ప్రజలు, ప్రజాప్రతినిధులు మాత్రం అగ్గి మీద గుగ్గిళమవుతున్నారు.
కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు గుట్టు చప్పుడు కాకుండా సచివాలయం నాలుగు గోడల మధ్య జరిగిన ఈ పుట్టినరోజు సంబరాల వీడియోను వీఏఏ సుస్మిత స్వయంగా తన వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఆ వీడియోలను అలా అలా అందరూ చూసి షేర్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయ్యింది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే సచివాలయ ఉద్యోగులు ఇలా బాధ్యతారాహిత్యం యూనిఫామ్ ధరించకుండా విధులు పక్కన పెట్టి, వేడుకల్లో పాల్గొన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సచివాలయంలో సీసీ కెమెరాలు ఉండియుంటే ఈ భాగోతం అంతా రికార్డు అయ్యేదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేసారు. ఇంతలా దావనంలా వ్యాపించిన ఈ సంఘటనపై కూత వేటు దూరంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం నుండి ఎటువంటి శాఖాపరమైన చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ పుట్టినరోజు వేడుకలపై సత్వరమే సమగ్రమైన విచారణ చేపట్టి సదరు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే వీటి స్పూర్తితో ఇతర సచివాలయాల్లో మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాగలవని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు.
*'జగనన్నకు చెబుదాం..!: 1902, సచివాలయం సిబ్బందిపై ఫిర్యాదులకు హెల్ప్ లైన్ నెం., టోల్ ఫ్రీ నెంబర్లు' అందుబాటులో ఉన్నా.. ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు అని తెలిసినా కూడా ఆ ఇద్దరు ఉద్యోగులు ఇలా డ్రెస్ కోడ్ లేకుండా నిర్భీతిగా సచివాలయంలోనే వేడుకలు జరుపుకోవడం, వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తుంటే మండల స్థాయి ఉన్నతాధికారుల నిస్సహాయతను అర్థం చేసుకోవచ్చు. ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు అందినా అధికారులదే బాధ్యత అలాంటిది ఈ వేడుకల సంగతి తెలిసినా బయటకు పొక్కనీయకుండా వారికి ధైర్యం చెప్పడమనేది ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేలా ప్రోత్సాహించడం కాదా అని విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన సచివాలయం ఉద్యోగులు, వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని నిప్పులు చెరుగుతున్నారు.
ఈ విషయంపై కోట ఎంపీడీఓ మారెళ్ల భవానిని వివరణ కోరగా, వెంకన్నపాళెం సచివాలయంలో పుట్టినరోజు వేడుకలను గూర్చి తనకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు. సంఘటన పూర్వ పరాలు సేకరిస్తానని చెప్పారు. వెంకన్నపాళెం ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి రియాజ్ తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
రవికరణాలు తెలుగు దినపత్రిక మీ మునిరాజ్