తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డా. ఎస్. వెంకటేశ్వర్
అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరి సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా కృషి చేస్తాను: కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డా. ఎస్. వెంకటేశ్వర్
రవి కిరణాలు,తిరుపతి, జూలై04:-
తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా. ఎస్. వెంకటేశ్వర్ గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో గతంలో కలెక్టర్లు అనేక సమస్యలను పరిష్కరించి ఉంటారని, తిరుపతి నూతన జిల్లా ఏడు నియోజకవర్గాలతో పారిశ్రామిక గ్రామీణ పట్టణ వాతావరణం కలిగిన జిల్లా అని, తిరుపతి జిల్లాలో సంక్షేమం మరియు అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతనిస్తూ జిల్లాను అందరి సహకారంతో సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తిరుమల ఏడుకొండల స్వామి వారు కొలువై ఉన్న తిరుపతి జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమలు చేసి, పరిశ్రమలు నెలకొల్పడానికి, పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్న జిల్లాగా పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో ఒకటో తారీకుననే 98 శాతం పైగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు వారి ముంగిటకు సచివాలయ సిబ్బంది ప్రణాళికా బద్ధంగా పనిచేసి చక్కగా అందచేశారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయని, జిల్లాలో డెంగ్యూ జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, అధికారులు జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర,తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఆర్డీఓ లు తదితరులు కలెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.