ముత్తుకూరు అభివృద్ధికి పెద్దపీట
ముత్తుకూరు అభివృద్ధికి పెద్దపీట
రూ. 33.68 కోట్లతో అభివృద్ధి పనులు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి
ముత్తుకూరు మండలంలో సుడిగాలి పర్యటన
నెల్లూరు /ముత్తుకూరు, ఫిబ్రవరి 2 : ముత్తుకూరులో రూ.33.68 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టి, ముత్తుకూరు అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ముత్తుకూరులో మంత్రి సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పటికే 20 కోట్ల 29 లక్షల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పనులు పూర్తి చేసామని, మరో 13 కోట్ల 68 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయని, వెరసి 33 కోట్ల 68 లక్షల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని వివరించారు. ముత్తుకూరు గ్రామంలో సుడిగాలి పర్యటన జరిపి సుమారు 2.12 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అందులో భాగంగా 50 లక్షల ఎన్ ఎం సి నిధులతో నిర్మించిన ఫిష్ మార్కెట్, 43.60 లక్షల ఖర్చుతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని , 60 లక్షల ఖర్చుతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను, 33.50 లక్షల ఖర్చుతో నిర్మించిన సైడ్ కాలువలను, ముస్లిం స్మశాన వాటిక ప్రహరి గోడ నిర్మాణాన్ని , శరత్ రాయల్ స్కేటింగ్ అకాడమీని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సుదీర్ఘ కాలంగా సర్వేపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధిపరిచి ప్రారంభోత్సవాలు చేస్తుండడం సంతోషదాయకంగా ఉందన్నారు. గతంలో గ్రామాల్లో సరియైన పంచాయతీ భవనాలు కూడా ఉండేవి కాదని, ఆ పరిస్థితి నుండి 2వేల జనాభా కలిగిన ప్రాంతానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ, ప్రజల అవసరాలను తీర్చడం సులభతరమయ్యే విధంగా గ్రామ సచివాలయాలను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందన్నారు . వాలంటీర్ల ద్వారా రు.3వేలు పెన్షన్ నేరుగా లబ్ధిదారుల ఇంటికి నడిచి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముత్తుకూరు మండలంలో నాన్ ఫిషర్ మాన్ ప్యాకేజీ కింద అర్హత ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగిన 16,231 మందికి అందజేశామని, ముత్తుకూరు గ్రామానికి సంబంధించి 417 కుటుంబాలకు అందించామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుండి టెర్మినల్ తరలిపోతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనను నమ్మవద్దని, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసే బాధ్యత తనదని మంత్రి స్పష్టం చేశారు.
చివరిగా మంత్రి 41 మంది అర్హత గల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ కుమార్ , ఎంపీపీ సుగుణమ్మ, సర్పంచ్ లక్ష్మమ్మ , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.