ఈ నెల 29నుంచి వచ్చేనెల 2 వరకు
రొట్టెల పండుగ
ఎంపీ ఆదాల
ఈనెల 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు బారాషాహీద్ దర్గాలో 5 రోజులపాటు రొట్టెల పండుగ జరుగుతుందని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రొట్టెల పండుగను ఏ విధంగా నిర్వహించాలనే విషయమై శుక్రవారం దర్గాలో అధికారులు, మైనార్టీ వర్గ నేతలతో ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ తో సహా అధికారులు తాము నిర్వహించబోయే ఏర్పాట్ల గురించి ఎంపి కి వివరంగా తెలిపారు. మైనార్టీ నేతలు కూడా తమ సలహాలు, సూచనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండుగ ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో ఇతర అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇప్పటికే అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించడానికి సమాయత్తం అయ్యారని తెలిపారు. మున్సిపల్ శాఖ దర్గాలో పరిశుభ్రత, మంచినీటి వసతి, మిగతా ఏర్పాట్లు చూస్తుందని, వైద్యశాఖ రెండు శిబిరాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. పార్కింగ్, బందోబస్తుతోపాటు ఆకతాయిలపై కట్టడి,తదితర విషయాలపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి దర్గాను తగిన ఏర్పాట్లతో అద్భుతంగా తీర్చిదిద్ది, సిద్ధం చేస్తారని తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువమంది భక్తులు వస్తారని భావించి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వర్షం వస్తే దగ్గరలోని కళ్యాణ మండపాలను సిద్ధంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఈ రాష్ట్ర పండుగను విజయవంతం చేసేందుకు అధికారులు, మైనారిటీ యువకులు ముందుకు వచ్చి పని చేయాలని కోరారు. వృద్ధులు, మహిళలకు సహకరించాలని కోరారు. కార్పొరేటర్లు కూడా పండుగ ముగిసేంతవరకు ఇక్కడే ఉండి సేవ చేయాలని పేర్కొన్నారు. మతసామరస్యానికి నెల్లూరు జిల్లా పెట్టింది పేరని గుర్తు చేశారు. ఈ జిల్లాలో వస్తానయ్య, హజరతయ్య పేర్లు మతసామరస్యాన్ని సూచిస్తాయని గుర్తు చేశారు. దీన్ని ఇంకా ఇనుమడించే విధంగా ఏర్పాట్లు చేసి రొట్టెల పండుగను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ గత ఏడాది రొట్టెల పండుగకు పది లక్షల మంది వచ్చారని, ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ నుంచి ఈ పండుగ కోసం 2.8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు.
అంతకుముందు ఎంపీ ఆదాల బారాషాహీద్ ల సమాధులను సందర్శించి చాదర్ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వక్ఫు బోర్డు చైర్మన్ మీరా, ముస్లిం కార్పొరేటర్లు సత్తార్, మోబీన, నేతలు రియాజ్, సలీం, అబూబకర్, కంతర్ అలీ, ఖాద్రి, షాజహాన్ ముస్లిం మత పెద్దలు అబూబకర్, షాజహాన్, అబ్దుల్ రజాక్, సంధాని భాష,షకీల్ అహ్మద్ ఈద్గా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు వాసంతి, అవినాష్, నూనె మల్లికార్జున యాదవ్, మూలే విజయభాస్కర్ రెడ్డి, ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేతలు కోటేశ్వర్ రెడ్డి, రాజేష్, హరిబాబు యాదవ్, యేసు నాయుడు, మల్లు సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.